Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో వరద బాధితులు
- వరదల నుంచి కాపాడమంటే వెళ్లిపొమ్మంటారా..?
- కరకట్టలు కట్టమంటే కనికరం చూపరా..?
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం క్షేత్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వచ్చిన వరదలు భద్రాచలం పట్టణాన్ని ముంచెత్తిన విషయం విదితమే. శివారు కాలనీలు జలమయమయ్యాయి. 1986, 91 తరువాత అతిపెద్ద గోదావరి ఈ ఏడాది వచ్చింది. 71 అడుకులపైగా గోదావరి వచ్చి పడటంతో ఒక్కసారిగా భద్రాచలం తుళ్ళి పడింది. గోదావరి కరకట్టల ఆవశ్యకత ఈ గోదావరి చాటి చెప్పింది. కరకట్టలు ఎత్తు పెంచటంతో పాటు, కరకట్టల పొడిగించడం అనివార్యంగా మారింది. అయితే భద్రాద్రి వద్ద కరకట్టల పొడిగింపుపై, ఎత్తు పెంచడంపై ప్రణాళికలు తయారవుతున్నాయి ఓవైపు జిల్లా తెరాస ప్రజా ప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తుండగా, మరోవైపు భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల కాలనీవాసులను ఇతర ప్రాంతాల వైపు తరలించే ప్రయత్నాలకు అధికారులు శ్రీకారం చుట్టడంపై స్థానికంగా సర్వత్రా చర్చనీయాంసమైంది. అంతేకాకుండా పట్టణ ప్రజలను తీవ్ర గందరగోళంలో పడేసింది. కరకట్టలు పొడిగించి, ఎత్తు చేస్తే సరిపోతుంది కదా...? అటువంటి ప్రయత్నానికి వడివడిగా అడుగులు వేయకుండా, కాలనీలో అధికారులు పర్యటించి సర్వేలు చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని స్థానికులు మదన పడుతున్నారు. తరతరాలుగా తమ ఇళ్లను, ప్రాంతాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, వరద భయం పేరుతో తమను ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేయటం విరమించాలని స్థానికులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పట్నంలోని వరద ప్రభావిత కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆలోచించి తమ కాలనీల ప్రాంతంలోని కరకట్టలను పటిష్టం చేసి, ఎత్తు పెంచి, పొడిగించి తమ ప్రాంతాల రక్షణకు పూనుకోవాలని వరద బాధిత ప్రభావిత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
మా ప్రాంతమే కనపడిందా : చికెన్ మార్కెట్ వ్యాపారస్తులు ఆవేదన
వరద బాధితులకు ఇల్లు కట్టించే పనిలో భాగంగా ఇటీవల జిల్లా కలెక్టర్ కొత్త మార్కెట్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో వరద బాధితులకు ఇల్లు కట్టిస్తామని, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానిక వ్యాపారస్తులకు సూచించారు. అయితే వ్యాపారస్తులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. గతంలోనే పాత మార్కెట్లో ఉన్న తమను, కొత్త మార్కెట్లోకి తరలించారని ఆ సందర్భంలోనే తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తమను మరోమారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలు విరమింప చేసుకోవాలని చికెన్, మటన్, చేప మార్కెట్ వ్యాపారస్తులు గంటపదంగా చెబుతున్నారు. తమ గురించి అధికారులు పునరాలోచన చేయాలని వారు వేడుకుంటున్నారు.
ప్రభుత్వమే కరకట్టపై దృష్టి సారించాలి : మచ్చా
భద్రాచలం పట్టణ వరద బాధితుల కోసం ప్రభుత్వం తక్షణమే కరకట్టలపై దృష్టి సారించాలని, అధికారులు స్థానికులను గందరగోళానికి గురి చేయవద్దని, స్పష్టమైన విధివిధానాలను వెల్లడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రజాకాంక్షల కనుగుణంగా సీపీఐ(ఎం) ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన హెచ్చరించారు.