Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయిలో గెలలు దిగుబడి
- సెప్టెంబర్‌లో 43,489 టన్నులు
- సెప్టెంబర్ ధరే చెల్లించాలి : రైతులు
- సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం : ఆయిల్ ఫెడ్ చైర్మన్
- నిరసనకు దిగిన సాగు దారులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ఏడాది అతివృష్టి కారణంగా అధికంగా వర్షాలు కురవడంతో ఆయిల్ పామ్ గెలలు ఇబ్బడిముబ్బడిగా రికార్డు స్థాయిలో దిగుబడి అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నెల సెప్టెంబర్‌లో 43489 టన్నులు గెలలు దిగుబడి జరిగింది. పరిశ్రమల సామర్ధ్యం మించి గెలలు దిగుబడి కావడంతో గత నెలలో వారం రోజులు ఫ్రూట్ హాలిడే ప్రకటించారు. అయినా శనివారం నాటికి అశ్వారావుపేట, అప్పారావు పేట పరిశ్రమల్లో 5 వేల 5 వందల టన్నులు పేరుకు పోయాయి. ఇంకా రెండు పరిశ్రమలు బయట 200 గెలలు వాహనాలు నిలిచి ఉన్నాయి. ప్రతీ నెలా ఒకటో తేదీ నుండి గెలలకు కొత్త ధర అమలు అవుతుంది. గత నెల టన్ను పామ్ ఆయిల్ గెలలు ధర రూ.16295 ఉంది. అక్టోబర్‌లో గెలలు ధర తగ్గే అవకాశం ఉన్నందున ఒకటో తేదీ దిగుమతి చేసుకున్న గెలలకు సెప్టెంబరు ధరే చెల్లించాలని రైతులు పట్టు పట్టారు. అలా కుదరదని ఆయిల్ ఫెడ్ అధికారులు నిరాకరించడంతో ఎంపీపీ శ్రీరామమూర్తి, వైస్ ఎంపీపీ ఫణీంద్ర లోడుతో పాటు, రైతు సంఘం నాయకులు తుంబూరు మహేశ్వర రెడ్డి, జగన్నాధం, భద్రంలు నిరసన చేపట్టారు.
ఒకటో తేదీ దిగుమతి చేసుకున్న గెలలకు సెప్టెంబర్ ధర చెల్లించాల్సిందే : తుంబూరు మహేశ్వర రెడ్డి
28, 29, 30 తేదీలలో సేకరించి పరిశ్రమకు తరలించినా ప్లాట్ ఫాం సరిపడా లేదని గెలలు తీసుకోకుండా తేదీ మారిందనే నెపంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆయిల్‌ఫెడ్ తగిన నిర్ణయం చేసి రైతులకు సెప్టెంబర్ ధర చెల్లించాల్సిందే.
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం : ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి
ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులతో చర్చించి సెప్టెంబర్ నెల ధర చెల్లించడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం.