Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.శ్రీనివాసరావు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పంచాయతీ, మౌలిక వనరుల కేంద్రంలో శనివారం వరకట్న దురాచారంపై గోడపత్రికను ఆవిష్కరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వరకట్నాన్ని ఎదిరించాలన్నారు. నేటి యువత తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వరకట్నమనే ప్రసక్తి లేకుండా వివాహం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాహ సమయంలో వధువుకు వచ్చిన కానుకలపై ఆమెకు పూర్తి అధికారం ఉంటుందన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమేనన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండి సమాజాన్ని నడిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంకా వరకట్నం వేధింపులకు గురైన మహిళలు అత్తింటి నుంచి గాని, పుట్టింటి నుండి గాని పోలీసు వారికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ విషయంలో బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ వరకట్న దురాచారాన్ని రూపు మాపేందుకు యువత ఆలోచన చేయాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల, గ్రామ స్థాయి అధికారులు దృష్టి సారించి బాల్య వివాహాలను నిరోధించాలన్నారు. నేటి సమాజంలో యువతీ, యువకులకు అన్ని రంగాలలో పోటీనిస్తున్నారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి జావెద్ పాషా, సీనియర్ సివిల్ జడ్జి అమరావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, 1వ అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి శాంతిసోని, 2వ అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి మౌనిక, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, న్యాయ సహాయ న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.