Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అవగాహన ముఖ్యం
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
లే-అవుట్ ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశిం చారు. ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్ ఆమోదం కోసం అందిన (14) దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించిన 8 దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కోస?ం రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాలు, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి 21 రోజుల లోపు అనుమతులు జారీచేయాలన్నారు. తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదిస్తామని తెలిపారు. గ్రీన్ బెల్ట్ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని మొక్కలు నాటాలన్నారు. అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్ట బద్దంగా సమగ్ర ప్రణాళికబద్ధంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇరిగేషన్ సి.ఇ. శంకర్ నాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర నాథ్, ట్రాన్స్ కో ఎస్.ఇ. సురేందర్, పంచాయతీ రాజ్ ఇఇ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఇఇ శ్యాంప్రసాద్, మధిర మునిసిపల్ కమిషనర్ రమాదేవి, ఖమ్మం అర్బన్, రూరల్ తహశీల్దార్లు శైలజ, సుమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అవగాహన ముఖ్యం
ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డీపీఆర్సీ భవనం లో ఆర్వోఎఫ్ ఆర్ చట్టంపై శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. షెడ్యూల్ తెగల అటవీ హక్కుల గుర్తింపు బిల్లు 13 డిసెంబర్ 2005 లో లోక్ సభలో ప్రవేశపెట్టి, 31 డిసెంబర్ 2007 నుండి చట్టం, 1 జనవరి, 2008 నుండి నియమాలు అమలులోకి వచ్చాయని వివరించారు. తరతరాలుగా అడవిపై ఆధారపడి జీవిస్తూ, ఎలాంటి హక్కులు లేని షెడ్యూల్ తెగలు, ఇతర అటవీ నివాసితుల హక్కులను గుర్తించి నమోదు చేయడం ఈ చట్టం లక్ష్యమని అన్నారు. అడవి, అటవీ భూములపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న అటవీ నివాసితులైన షెడ్యూల్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు 13 డిసెంబర్ 2005 నాటికి ముందు కనీసం 3 తరాలు అనగా 75 సంవత్సరాలుగా నివసిస్తే అర్హులని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 94 గ్రామ పంచాయతీలకు చెందిన 132 ఆవాసాల నుండి 18,295 దరఖాస్తులు 42,409,04 ఎకరాలకు వచ్చాయన్నారు. సర్వే, క్షేత్ర పరిశీలన కోసం 48 టీములు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీని ఒక యూనిట్ గా, ఆవాసాల వారీగా గ్రామసభ ఏర్పాటు చేయాలన్నారు. సర్వే, క్షేత్ర పరిశీలన చేపట్టాలన్నారు. అటవీ హక్కుల నిర్ధారణకు ఆధారాలు సేకరించాలన్నారు. అటవీ హక్కుల క్లైములకు సంబంధించిన వినతులపై చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తుల విచారణ అనంతరం గ్రామసభ తీర్మానం చేసి, డివిజన్ స్థాయి కమిటీకి పంపాలన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.