Authorization
Sun April 06, 2025 07:28:07 pm
- మతతత్వ బీజేపీ విధానాలను ఎండగట్టాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రజల కోసం శ్రమించే దీటైన పోరాట యోధుడు కొడియేరి బాలకృష్ణన్ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం సారపాకలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నియోజక వర్గ స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దోపిడీ లేని భారత సమాజం కోసం, సామాజిక పరివర్తన కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని అంచలంచెలుగా మూడుసార్లు కేరళ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ అచ్చున్నత నిర్ణయాక మండలి సభ్యులుగా, ఐదుసార్లు శాసన సభ్యులుగా, కేరళ హౌమ్ మినిస్టర్‌గా ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం నిర్వహించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని ఆయన అన్నారు. మతతత్వ బీజేపీ విధానాలను ఎండగట్టాలన్నారు. బూర్గంపాడు మండలంలో గోదావరి నదికి కరకట్ట నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వరదల కారణంగా సుమారు 10 గ్రామాలు ముంపు గురవుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం బాలకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, నాయకులు రాములు, కొమరం కాంతారావు, మడి రమేష్, లెనిన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.