Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుణపాఠంగా భావించి ఇకముందు తప్పులు చేయకండి
- ఐటీడీఏ పీవో
నవతెలంగాణ-భద్రాచలం
మానవులుగా జన్మించిన తర్వాత క్షణికమైన ఆవేశంలో తప్పులు చేయడం మానవులకు సహజమని, అనవసరంగా పొరపాట్లు చేసి జైలుకు రావడం వలన సమాజంలో అప్రతిష్ట పాలు కావడమే కాక, మీ కుటుంబాలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి తప్పులు చేయకుండా ఇది కేవలం గుణపాఠంగా భావించి, జైలు నుంచి విడుదల కాగానే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు సంబంధిత ఖైదీలకు సూచించారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా భద్రాచలంలోని సబ్ జైల్లో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సబ్ జైల్లోని పరిసరాలను పరిశీలించి, గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనకు మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో నడుచుకుంటూ సత్యం, అహింస అన్న సూత్రాలను పాటించి గాందేయవాదాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం ఏఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఖైదీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, మీరు తెలిసి తెలియక తప్పులు చేసిన జైలుకు వచ్చిన తర్వాత మీలో మార్పు రావాలన్నారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా వివిధ క్రీడలలో గెలుపొందిన మహిళా ఖైదీలకు, పురుషులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో భద్రాచలం ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఏపీపీ భద్రాచలం దుర్గాబాయి, సీఐ నాగరాజు, ఐటీసీచీఫ్ మేనేజర్ చంగల్ రావు, జైలు పర్యవేక్షకుడు ఉపేందర్, జైలు వార్డెన్ రాము, పోలీస్ శాఖ సిబ్బంది ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.