Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని స్థానిక టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేను స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. మండలంలోని మర్కోడు గ్రామం నుంచి కరకగూడెం మండలంలోని రేగళ్ల వరకు బీటీ రోడ్డు, రెండు చోట్ల కల్వర్టుల నిర్మాణం, అలాగే అడవిరామారం నుంచి దొంగతోగుకు, ఆళ్ళపల్లి నుంచి పెద్ద వెంకటాపురంకు, రాయిలంక నుంచి మర్కోడుకు బీటీ రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతోపాటు సీతానగరం గ్రామస్తులు పనుల నిమిత్తం బయటకు రావాలంటే జల్లేరు వాగు దాటాల్సవస్తుందని, దీనిపై వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు. బీటీ రోడ్లకు, కల్వర్టులకు, వంతెనకు నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే వాటి శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, ఉపాధ్యక్షుడు బుర్ర వెంకన్న, నాయకులు గొగ్గెల లక్ష్మయ్య, హఫీజ్, కొమరం సతీష్, ఆదం, మద్దెల వెంకటేశ్వర్లు, శైల, తదితరులు పాల్గొన్నారు.