Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ఆర్సీ కమిటీల తీర్మానం ఆధారంగానే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
విద్యుత్ బిల్లులో అదనపు చార్జీల పేరుతో ఇష్టానుసారంగా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోపుతోందని ఈ ఆర్థిక భారాన్ని, అదనపు చార్జీల పేరుతో వసూళ్లను నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఎడిషనల్ కంజంషన్ డిపాజిట్ (ఏసీడీ), డెవలప్మెంట్ చార్జీల పేరుతో వేలాది రూపాయలు ప్రతి వినియోగదారుడు నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుందని ఈ రకమైన ఆర్థిక భారాలను సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం పై మోపటాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులో అదనపు చార్జీల వసూళ్లను నిలిపివేయాలని లేదంటే వినియోగదారులను సమీకరించి పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని నీరుగార్చి, ఎఫ్ఆర్సికమిటీలను (ఫారెస్ట్ రైట్స్ కమిటీలను )నిర్వీర్యం చేసి ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోడు భూములకు హక్కుదారులను గుర్తించే పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా ఎన్నిక చేయబడిన గ్రామ అటవీ హక్కుల గుర్తింపు కమిటీల తీర్మానాల ఆధారంగానే పోడు భూముల హక్కుదారులను ఎంపిక చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపుపైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం పట్టణానికి రామాలయానికి జరిగే నష్టం పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముంపుని నివారించే మార్గాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందుకు ముందుకు రాకపోవడం ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ముంపు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని భద్రాచలం ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి ముంపు ఉన్నందువల్ల ఇక్కడ నిర్వాసిత ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, కారం పుల్లయ్య, ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దబ్బకట్ల లక్ష్మయ్య, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నాయకులు కుమ్మరి శ్రీను, కొరసా చిలకమ్మ, మర్మం చంద్రయ్య కొప్పుల రఘుపతి, సున్నం గంగా, కారం నరేష్, మచ్చ రామారావు, వెంకట రామారావు, నకిరికంటి నాగరాజు, కట్ల నరసింహాచారి, బందెల చంటి, దామోదర్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.