Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని విరాట్‌నగర్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని ఇండ్లులేని పేదలకు పంచాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లులేని పేదలను కలుపుకొని ఆ భూమిలో మనావతారాయ్ కాంగ్రెస్ జెండాలు పాతారు. స్థానిక పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ నాయకులు జెండాలు పాతే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా విరాట్‌నగర్‌కు చెందిన ప్రజలు తమ కాలనీ ఎదురుగా జెండాలు పాతవద్దంటూ ఎదురు తిరిగారు. విరాట్‌నగర్‌లో ఇండ్లులేని పేదలు చాలామంది ఉన్నారని, ఆ భూమిలో విరాట్‌నగర్‌కు చెందిన వాళ్లే ఇండ్లు వేసుకుంటారంటూ చాలాసేపు వాగ్వాదానికి దిగారు. విరాట్‌నగర్‌లో ఇండ్లులేని వారికి అవకాశం ఉంటుందని, ఖాళీగా చాలా భూమి ఉన్నందున అందరికి సరిపోతుందని మానవతారాయ్ వారికి సర్దిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లిలోని పలు కాలనీల్లో చాలా మందికి సొంతిండ్లు లేవని, ఈ నేపధ్యంలో విరాట్‌నగర్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని పట్టణంలోని ఇండ్లులేని పేదలకు పంచేందుకు సరిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల ఇండ్ల నిర్మాణాలకు రూ. 5లక్షల ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణాలకు రూ. 3లక్షలు ఇవ్వకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలందరికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నకేశవరావు, రావి నాగేశ్వరరావు, మానుకోట ప్రసాద్ పాల్గొన్నారు.