Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు రోజుల శ్రీకోటమైసమ్మ జాతర
- 5 నుంచి జాతర ప్రారంభం
- వినోదానికి జాతరలో ప్రాధాన్యత
నవతెలంగాణ-కారేపల్లి
సింగరేణి కాలరీస్ ప్రాంతంలో దసరా వచ్చిందంటే సందడి నెలకొంటుంది. శ్రీకోట మైసమ్మతల్లి జాతరతో సందడి మరింత ఊపు అందుకుంటుంది. విజయదశమి మొదలు ఐదు రోజులు నిరంతరాయంగా సాగే జాతర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దజాతరగా చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో నిర్వహించే కోటమైసమ్మ తల్లి జాతర అన్ని హంగులతో ముస్తాబైంది. జాతర రాత్రి సమయాల్లో విద్యుత్ వెలుగులతో జాతర ద్వైదీపమానంగా వెలుగొందుతుంది. మొక్కజొన్న, పెసర, నువ్వులు, పత్తి వంటి పంటలు రైతుల చేతికి వస్తున్న దశలో ఈ జాతర జరుగుతుండటంతో రైతు కుటుంబాలు ఇంటిల్లి పాటి జాతరకు వచ్చి అనందంగా గడుపుతారు. ఖమ్మం జిల్లా నుండి కాక భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వేలాది మంది ఈ జాతరకు తరలివస్తుంటారు. ఈ జాతరకు వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకోవటంతో పాటు జాతరలో ఏర్పాటు చేసే వినోదాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకోని సందడి చేస్తారు. ఈసారి జాతరలో కుటుంబ సమేతంగా వినోదం కోసం పెద్దపెద్ద జాయింట్వీల్, క్రాస్వీల్, కొలంబస్, బ్రేక్డ్యాన్స్, డ్రాగెన్ ట్రైన్, చిన్న పిల్లకు రంగురాట్నం, గండ్రంగా తిరిగే కారు, బైక్ వంటి వినోదాంశాలను ఏర్పాటు చేశారు. రోజంతా వినోదాత్మక కార్యక్రమాల్లో ఉత్సహంగా గడిపేలా ఏర్పాటు చేశారు. ఈ జాతర సంబంధించి ప్రత్యేక కధనాలు ఉన్నాయి.
మృగాల నుండి రక్షించాలని కట్టిన కోట...
ఆలయ అర్చకులు కొత్తలంక కైలాస శర్మ ఆలయ విశిష్టతను నవతెలంగాణకు వివరించారు. 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన ఆడవి ఉండి కృరజంతువుల బారీన పడి పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో తమను రక్షించమని అమ్మవారికి వారిని కోరుతూ గుట్టమీద కోటను నిర్మించి దానికి కోటమైసమ్మగా నామకరణం చేశారు. 1948వ సంత్సరంలో పర్సా క్రిష్ణారావు-దమయంతి దంపతులు అమ్మవారి శిల్పంను తయారుచేయించి అక్కడ ప్రతిష్టించటం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు అక్కడ ఉత్సవాలు వీరి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించటం అనావాయితీగా జరుగుతుంది. ప్రారంభంలో చిన్న దేవాలయంగా ఉన్న కోటమైసమ్మ తల్లి ఆలయం నేడు అతి పెద్ద జాతరగా రూపాంతరం చెందటం విశేషం. ఈ జాతర ఈనెల 5వ తేది నుండి 10తేది వరకు జరుగనుంది.
పట్టించుకోని ప్రభుత్వ శాఖలు
జిల్లాలోనే అతి పెద్ద జాతరగా చెప్పబడుతున్న కోటమైసమ్మ జాతరను ప్రభుత్వ శాఖాలు పట్టించుకున్న పాపాన లేదు. జాతర మూడు రోజులు మాత్రం పోలీసు శాఖ బంద్ బస్తు, వైద్యశాఖ వైద్యశిబిరాన్ని నిర్వహిస్తుంది. రెవిన్యూ శాఖ, ఆర్Êబి, సింగరేణి సంస్ధలు జాతర పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. జాతరకు వెళ్లే రహదారులు బాగుపడటంతో ఈ జాతర సందర్బంగా ఆర్టీసీ వారు బస్ సౌకర్యం కల్పిస్తే నడపితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జాతరకు ఏర్పాట్లు పూర్తి-ఈవో కొండకింద వేణుగోపాలచార్యులు
దేవదాయశాఖ ఆధ్వర్యంలో జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఇఓ కొండకింది వేణుగోపాలచార్యులు తెలిపారు. ఇప్పటికే జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలు, ఎగ్జిబిషన్, ఇతర వినోద సాధనాలకు వేలం పాట నిర్వహించాన్నారు. భక్తులకు ఇబ్బంది కల్గకుండా త్రాగునీరు సౌకర్యం, మరుగుదొడ్లు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు.