Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో ఘనంగా కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలు
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్
నవతెలంగాణ-ఖమ్మం
దళితుల సమస్యలపైన సమరశీల పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన సంఘంగా రాష్ట్రంలో కేవీపీఎస్కు మంచి గుర్తింపు వచ్చిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని పాత బస్టాండ్ సెంటర్ లోని చర్మకారుల అడ్డాలో కెవిపిఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం జెండాను మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాలతో సంఘం ఏర్పడిందని, కెవిపిఎస్ ఏర్పడిన దగ్గర నుండి అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిన సంఘంగా రాష్ట్రంలో నిలిచిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకం గానే ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తున్నదని, సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులకు మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు దళిత బంధు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతికంగా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పార్టీలకతీతంగా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు నకరికంటి చిరంజీవి, నాయకులు జెర్రిపోతుల కిరణ్, చాట రాము, చర్మకారుల సంఘం నాయకులు గుద్దేటి వెంకయ్య, తిరుమల రావు, నాగరాజు, భద్రం, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.