Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ కార్యాలయం
- ముందు ఉపసర్పంచ్ నిరసన
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో సువర్ణాపురం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆ గ్రామ ఉప సర్పంచ్ తోట ధర్మారావు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. సర్పంచ్ కొట్టే అపర్ణ చెక్కుల మీద సంతకాలు పెడితేనే గ్రామంలో వీధిలైట్లుతో పాటు, మంచినీళ్లు పంపులను వదులుతామని చెప్పటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు అవాక్కయామన్నారు. గతంలో గ్రామపంచాయతీ సంబంధించిన చెక్కులన్నింటికీ సంతకాలు పెట్టామన్నారు. మరలా తిరిగి దొంగ బిల్లులకు సంతకాలు పెట్టమని వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలోనే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారన్నారు. గ్రామంలో వీధిలైట్లు వెలగటం లేదన్నారు. ఇప్పటికే రాత్రిపూట దొంగల భయంతో భయభ్రాంతులకు గురవుతున్నామని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డుసభ్యులు, గ్రామస్తులు దగ్గుపాటి ప్రేమకుమార్, అమరబోయిన వీరబాబు, కనపర్తి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ - ఉపసర్పంచ్ ఆధిపత్య పోరు
సువర్ణాపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి నేటి వరకు నాలుగు సంవత్సరాల కాలంలో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య ఆధిపత్య పోరు తప్ప, గ్రామఅభివృద్ధికి పాటుబడిన దాఖలాలు లేవని ఆగ్రామ ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, నిత్యం వారి మధ్య వాగ్వాదం, వాదోపవాదాలు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కాలం గడుపుతూ గ్రామపంచాయతీ నిధులను వృథా చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సర్పంచ్ ఉపసర్పంచ్ వ్యక్తిగత విమర్శలకు పోకుండా గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.