Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.9 లక్షల సొత్తు స్వాధీనం
- ఊరెళ్తే పోలీసులకు సమాచారం అందించాలి
- విలేకర్ల సమావేశంలో ఎస్పీ
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారని, వారి నుండి విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నగదును రికవరీ చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్.జీ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం కూలీ లైన్ ప్రాంతానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అలియాస్ చోటు చిన్నతనం నుండి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2012వ సంవత్సరంలో కొత్తగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరాజు హాస్పిటల్లో మొబైల్ దొంగతనం చేసి బాల నేరస్తుడిగా ఖమ్మంలో చిల్డ్రన్ హౌమ్‌లో గడిపాడని తెలిపారు. జైలుకు వెళ్లిన తరువాత దొంగలతో ఏర్పడిన పరిచయాల వలన రాత్రిపూట తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడటం అలవర్చుకున్నాడని తెలిపారు. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడి, పట్టుబడిన తరువాత భద్రాచలం సబ్ జైలుకు పంపడం జరిగింది. భద్రాచలం జైలులో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న విజరు, పాల్వంచలో దొంగతనం కేసులలో నిందితుడిగా ఉన్న జిల్లా వెంకట్‌లతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు.
ఈ సంవత్సరం జూన్ నెలలో షేక్ ఇర్ఫాన్, చల్లా వెంకట్లు కలిసి కొత్తగూడెం పట్టణంలో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలలో కొన్ని విజరుకు ఇవ్వగా అతను భద్రాచలంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి తిరిగి వీరికి నగదును ఇచ్చేవాడు. చల్లా వెంకట్ దొంగతనానికి పాల్పడిన సొమ్ము నుండి రూ.50వేలు తన సోదరి గొల్లి వసంతకు ఇచ్చాడు. ఇర్ఫాన్ కొత్తగూడెం త్రీ టౌన్ పరిదిలో జులై నెలలో ఒక దొంగతనం, ఆగష్టు నెలలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో కొత్తగూడెం త్రీ టౌన్ పరిధిలోని గాజుల రాజాం బస్తీ, గణేష్ టెంపుల్ వీధిలో పాల్పడిన దొంగతనాలలో ఇర్ఫాన్‌తో పాటు, ఇల్లందుకు చెందిన అజీమ్ కూడా ఉన్నాడని తెలిపారు. ఇర్వాన్కు అజీమ్ బాల్య మిత్రుడు ప్రస్తుతం అజీమ్ హైదరాబాదులో అమెజాన్‌లో డెలివరీ బారుగా పని చేస్తున్నాడు. ఇర్ఫాన,్ అజీమ్ ద్వారా దొంగిలించిన కొన్ని బంగారు, వెండి ఆభరణాలను హైదరాబాద్ మనప్పురంలో తాకట్టు పెట్టించి మైసూర్, వైజాగ్ లాంటి పట్టణాలకు వెళ్లి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని తెలిపారు. సోమవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా షేక్ ఇర్ఫాన్, అజీమ్‌లు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఇరువురు తాము చేసిన నేరాలను అంగీకరించారని తెలిపారు.
సొత్తు రికవరీ : పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరి వద్ద నుండి 78 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు రూ.50వేల నగదును స్వాధీనపరుచుకున్నా మన్నారు. గతంలో చల్లా వెంకట్ తన సోదరి అయిన గొర్రె వసంతకి ఇచ్చిన చోరీ సొత్తు రూ.39 వేలను రికవరీ చేయడం జరిగింది. మునప్పురం హైదరాబాద్ నుండి 11 గ్రాములు, భద్రాచలం ముతూటి నుండి 31 గ్రాముల బంగారు ఆభరణాలను రికవర్ చేయవలసి ఉందని తెలిపారు. మొత్తం చోరీకి గురైన కొత్తు విలువ రూ.13లక్షల విలువ కాగా ఇప్పటివరకు రూ.9,44,000ల విలువ గల సొమ్ముడు రికవరీ చేశామని, వీరిని జ్యుడీషియల్ రిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఊరు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలి
ప్రజలకు సెలవు దినాల్లో ఇంటిని వదిలి దూరప్రాంతాలకు వెళ్లే వారు ఊరు వెళ్లే ముందు పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమాచారం అందించడానికి సబ్ డివిజన్ల వారిగా ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగింది. త్వరలోనే జిల్లా మొత్తానికి ఒక ఫోన్ నంబరును కమాండ్ కంట్రోల్‌కు జిల్లా పోర్టల్‌కు అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం సబ్ డివిజన్- 9347064123, పాల్వంచ సబ్ డివిజన్-9703795315, ఇల్లందు సబ్ డివిజన్-6304258570, భద్రాచలం సబ్ డివిజన్-6303922241, మణుగూరు సబ్ డివిజన్-6300532713 ప్రజలుసహకరించి పోలీసులకు సమాచారం అందిచాలని కోరారు. దీని వలన ఆయా ప్రాంతాల్లో పోలీసు గస్తీ పెంచడం, నిఘాపెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరబాబు, త్రీ టౌన్ సీఐ అబ్బయ్య, సీసీఎస్ ఎస్ఐ సురేష్, బిక్షమ్య, శేఖర్, కోటేశ్వర రావు, మురళీ పోలీసులు పాల్గొన్నారు.