Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన పూల పండుగ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా తెలంగాణ ఆడపడుచులు నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటు సంబురంగా సాగాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అయిన వేడుకలు సోమవారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను తయారుచేసి, గౌరమ్మకు నిత్య పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పించారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ప్రదాన కూడలిలో ఏర్పాటు చేసిన గౌరమ్మల వద్ద బతుకమ్మ ఆట పాటలతో మహిళలు చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఆడి పాడారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువులు, వాగులతో పాటు, పర్ణశాల గోదావరి నదిలో బతుకమ్మలను వదిలి పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా... మళ్లీ ఏడాదికి తిరిగి రావమ్మా అంటూ సద్దుల బతుకమ్మను సాగనంపారు. బతుకమ్మ ఆటపాటలతో గోదావరి నదీ తీరం తోపాటు పర్ణశాల ఆలయ పరిసరాలు కోలాహలంగా సందడి నెలకొంది అని చెప్పవచ్చు.
పినపాక : బతుకమ్మ ఉత్సవాలలో చివరి రోజైన సద్దుల బతుకమ్మ సోమవారం ఆడపడుచులు రంగురంగుల పూలు, రంగులతో పేర్చిన బతుకమ్మలతో పినపాక మండలంలో గ్రామ గ్రామాన ఆట, పాటలతో చిన్నారుల కేరింతలతో సందడిగా మారింది. ఊరిలో పూలకళ మహిళల్లో లక్ష్మీ కలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా అడపడుచులందరూ కలిసి సద్దులబతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నిత్యం కొలువుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తామని ఈ సందర్భంగా మహిళలు తెలియజేసారు.
ములకలపల్లి : బతుకమ్మ సంబరాలు మండల వ్యాప్తంగా సోమవారం అంబరాన్నంటాయి. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మండల పరిధిలోని తిమ్మంపేటలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోగా జడ్పీటీసీ సున్నం నాగమణి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి మహిళలతో కలిసి ఆడిపాడి సందడి చేశారు. అదేవిధంగా పూసుగూడెం, మాధారం, చాపరాలపల్లి, కమలాపురం, ములకలపల్లి, జగన్నాధపురం, పొగళ్లపల్లి, తిమ్మంపేట తదితర గ్రామాల్లో మహిళలు బతుకమ్మలను అందమైన వివిధ రకాలతో తయారుచేసి ఆయా కూడళ్లలోకి తీసుకువచ్చి బతుకమ్మ ఆడారు. అనంతరం మేళతాళాల నడుమ బతుకమ్మలను ఊరేగించి సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అశ్వాపురం : బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని మండలంలో పల్లె పల్లెల్లో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మల ఆటలాడారు. ప్రధానంగా మొండికుంట, మల్లెల మడుగు, సీతారామపురం, రామ చంద్రపురం, అశ్వాపురం మిట్ట గూడెం, గోపాలపురం గ్రామాలలో ఈ బతుకమ్మ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించుకున్నారు. మొండికుంటలోని ముత్యాలమ్మ ఆల యం ప్రాంగణంలో పెద్ద ఎత్తున బతుకమ్మలు తరలిరా వడంతో ప్రజలు వీక్షించేందుకు అధిక సంఖ్యలో చేరుకు న్నారు. తెలంగాణ సాంప్రదాయాలను మిట్టిపడేలా ఈ బతు కమ్మ ఉత్సవాలను చేపట్టారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
టేకులపల్లి : మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో మహిళలు, యువతులు సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ రామాలయ మైదానికి భారీ బతుకమ్మలతో వందలాది మంది తరలివచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ పాటలు, కోలాటం ఆడుతూ మహిళలు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు మార్కెట్ యార్డ్ చైర్మెన్ బానోత్ హరి సింగ్ నాయక్, గోల్యా తండా సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్, సర్పంచ్ సరిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు చివరి రోజైన సోమవారం సందడిగా సాగాయి. ఆళ్ళపల్లి మండల కేంద్రముతో పాటు మర్కోడు, అనంతోగు, రాయిపాడు, రామాంజిగూడెం, పాతూరు, రాఘవాపురం, నడిమిగూడెం, బోడాయికుంట, పెద్ద వెంకటాపురం, అడవిరామారం, దొంగతోగు గ్రామాల్లో మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను అలంకరించారు. ఆళ్ళపల్లి, మర్కోడు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలకు స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ముఖ్య అతిథిగా హాజరై, పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి గ్రామ సమీపాల్లోని వాగుల్లో, చెరువుల్లో బతుకమ్మలను విడిచి మహిళలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారతి, విజయలలిత, జానకమ్మ, సువర్ణ, హైమావతి, మౌనిక, రాధిక, రేణుక, గౌరమ్మ, స్వరూప, రాజేశ్వరి, సుజాత, అనిత, తదితరులు పాల్గొన్నారు.