Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని
నవతెలంగాణ-చండ్రుగొండ
ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం రామఆడుగు వెంకటాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరైన స్థలం లేక, ఉండడానికి ఇల్లు లేక, అద్దె చెల్లించలేక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్థలం లేని వారికి స్థలం, ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయాలన్నారు. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైరస్ తెగులుతో మిర్చి తోటలను తీసేస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి, పార్టీ మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, గాలి రామారావు, కాకా సీత, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, మిర్యాల మోహన్ రావు, రాయి రాజా తదితరులు పాల్గొన్నారు.