Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలిపోయిన మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్
- బీడు భూములుగా పంట పొలాలు
- పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
నవతెలంగాణ - బోనకల్
మూడు గ్రామాల రైతుల కోసం 9 కోట్ల రూపాయలతో నిర్మించిన రాయన్నపేట-3 ఎత్తిపోతల పథకం మూడేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అయినా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో పంట పొలాలు సగం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి.
మండల పరిధిలోనే రాయన్నపేట గ్రామ సమీపంలో వైరా నదిపై రాష్ట్ర నీటిపారుదుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 9 కోట్ల రూపాయలతో రాయన్నపేట- 3 ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం కింద కలకోట, రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన 1100 ఎకరాలు సాగవుతోంది. 16 జనవరి 2014న ఆనాటి ప్రభుత్వ చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆ రోజు నుంచి 2018 వరకు ఏకధాటిగా మూడు గ్రామాల ప్రజలకు సాగునీరు అందించింది. 2019 నుంచి ఈ ఎత్తిపోతల పథకం మూలన పడింది. ఈ ఎత్తిపోతల పథకానికి మూడు మోటర్లు, ఒక కంప్లసర్ మోటర్ ఉంది. ఇందులో రెండు మోటార్లు, నీటిని ఎక్కించే కంప్లసర్ మోటర్ కాలిపోయింది. దీనికి తోడు ఈ ఎత్తిపోతల పథకానికి విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్ కూడా కాలిపోయింది. దీంతో తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఈ ఎత్తిపోతల పథకం కింద మూడు గ్రామాలకు చెందిన రైతులు మొదటి పంటగా పత్తిను సాగు చేస్తున్నారు. ఈ పంట ప్రస్తుతం వర్షం ఆధారంగా పండుతుంది. రెండవ పంటగా మొక్కజొన్న సాగు చేసేవారు. ఎత్తిపోతల పథకం పనిచేసిన సమయంలో రెండు పంటలను అన్నదాతలు పండించారు. 2019 నుంచి ఈ పనిచేయకపోవడంతో ఒక్క పత్తి పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. అదీ కూడా వర్షం ఆధారంగానే సాగు చేస్తున్నారు.
కొంతమంది రైతులు కలకోట చెరువుకి మోటార్ల ద్వారా సాగునీరు పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఐదు నుంచి 600 ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను కూడా నీటిపారుదల శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. 2019 నుంచి ఆయా గ్రామాల రైతులు స్థానిక ప్రజాప్రతినిధులకు, బోనకల్ మండల నీటిపారుదల శాఖల అధికారుల దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు. అయినా ప్రజాప్రతినిధుల, అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇటీవల రైతుల ఒత్తిడి మేరకు నీటిపారుదల శాఖ ఎస్సీ, బోనకల్ డీఈ సందర్శించారు. మరమ్మత్తుల కోసం సుమారు రూ.20 లక్షలు అవసరం ఉంటుందని అంచనా వేశారు. అంచనా వేసి సుమారు 8 నెలలకు పైగా అవుతున్నా అతీగతీ లేదు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
వెంటనే నిధులు మంజూరు చేయాలి : కర్నాటి రామకోటేశ్వరరావు, రైతు, రాయన్నపేట
మూడు గ్రామాల ప్రజల కోసం నిర్మించిన ఎత్తిపోతల పథకం మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీని కింద తనకు ఏడు ఎకరాల మెట్ట భూమి ఉంది. ఎత్తిపోతల పథకం పనిచేసిన సమయంలో రెండు పంటలను సాగు చేసాము. ప్రస్తుతం ఒక పంట మాత్రమే సాగు చేశాము. అది కూడా వర్షం ఆధారంగా మాత్రమే. వెంటనే ప్రభుత్వం, అధికారుల స్పందించి రైతుల కోసం నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం మరమ్మత్తుల కోసం వెంటనే నిధులు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.