Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి యందు నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేట్ చేసి ఏళ్లు గడుస్తున్న అందుకు తగిన స్థాయిలో డాక్టర్లు సిబ్బందిని అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడంతో పరిసర ప్రాంత రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే సిహెచ్సిగా అప్ గ్రేడ్ చేశారు. కనీసం పిహెచ్సి స్థాయిలో అందించిన వైద్య సేవలను కూడా నేడు అందించకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దుతున్నామంటూ ఒక పక్క ఆయా శాఖల మంత్రులు, అధికారులు గొప్పలు చెప్పడం తప్పా ఎక్కడ ఆచరణకు నోచుకోవడం లేదని విమర్శించారు. ఆసుపత్రులో గైనకాలజిస్ట్ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సామర్థ్యానికి తగినట్లుగా డాక్టర్లను, సిబ్బందిని నియమించి సంబంధిత పరికరాలను తక్షణమే ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. అనంతరం హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలపై స్థానిక వైద్యాధికారి డాక్టర్ రాజేష్ తో చర్చించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కె.వి రామిరెడ్డి, నాయకులు ఏటుకూరి రామారావు, రచ్చ నరసింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు, రాసాల కనకయ్య, బెల్లం లక్ష్మి, సిరికొండ ఉమామహేశ్వరి, కట్టెకోల వెంకన్న, పెద్దిరాజు నరసయ్య, బండి రామమూర్తి పాల్గొన్నారు.