Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన రేట్లతో సామాన్యుల సతమతం
- ఖర్చుకు వెరసి పండుగలకు పలువురు దూరం
- పండుగ పూట పిండివంటల కోసం తంటా
- గతేడాదితో పోలిస్తే పెరిగిన పిండి, నూనెల ధరలు
- ఎనిమిది నెలల్లో రూ.181 పెరిగిన గ్యాస్ రేటు
- చమురు వాత... రవాణాచార్జీల మోత
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'దసరా వచ్చిందమ్మో సరదా తెచ్చిందమ్మో...' అని సినిమా పాటలు వినే ఉంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పండుగైనా సరాదాకు బదులు సామాన్యులకు భారమే అవుతుంది. అదుపులేని ధరలతో బెంబేలెత్తాల్సి వస్తోంది. కుటుంబ బడ్జెట్ మొత్తం కకావికలం అవుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ధరలు చూసినా ఎగిసిపడుతున్నాయి. ఏ వంట చేయాలన్నా మంట కావాలి...అటువంటి గ్యాస్ సిలిండర్ ఎనిమిది నెలల క్రితం రూ.939 ఉన్నది...ఇప్పుడు రూ.1,120కి పెరిగింది. పిండి, నూనె పదార్థాల ధరలు గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20శాతం పెరిగాయి. రెండు, మూడు రోజుల క్రితం నూనెల ధరలు తగ్గించినా అవీ నామమాత్రమే. తగ్గించిన ధరలు ఇంకా పలుదుకాణాల్లో అమల్లోకి రాలేదు. తాము సరుకులు తీసుకొచ్చిన సమయంలో ఉన్న ధరల ఆధారంగానే విక్రయిస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే ఏ నూనె తీసుకున్నా రూ.50కి పైగానే ధర పెరిగింది. వివిధ రకాల పిండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఏ పిండైనా కేజీ రూ.20కి పైగానే ధర పెంచారు. గతేడాది చివరి వరకూ రూ.98 ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు రూ.112 పడుతోంది. ఆ మేరకు రవాణాచార్జీలు కూడా పెరిగాయి. సెస్, చిల్లర సమస్య లేకుండా చార్జీల సవరణతో టీఎస్ఆర్టీసీ చార్జీలు గతేడాది కన్నా రూ.10 నుంచి రూ.100 వరకూ పెరిగాయి. ఇక ఆటోల కిరాయిలకైతే అంతే లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లను సాకుగా చూపి రూ.20 తీసుకోవాల్సిన చోట రూ.50 వసూలు చేస్తున్నారు. అదుపులేని ధరలపై సామాన్యులు మండిపడుతున్నారు. రూ.100కు పైగా ధరలు పెంచి గరిష్టంగా రూ.50 తగ్గించి ప్రభుత్వాలు గొప్పలకు పోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల మాట.
- ధరల భారాలు ఎలా...!
ఏడాది కాలంలోనే ఆయా వస్తువులు, ధరల భారాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. ముందుగా వంట గ్యాస్ సిలిండర్ ధర తీసుకుంటే గతేడాది రూ.900 వరకూ ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.939 ఉంది. మార్చి నాటికి రూ.989కి చేరింది. ఇప్పుడు రూ.1,120 పడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7,50,229 గ్యాస్ కనెక్షన్లున్నాయి. సిలిండర్‌కు రూ.200 చొప్పున ధర పెరిగినా 9 నెలల కాలంలో జిల్లా ప్రజల నుంచి రూ.15 కోట్లకు పైగా అదనంగా వసూలు చేశారు. ఇక రవాణాచార్జీల విషయానికొస్తే ఉమ్మడి జిల్లాలో ఆరు డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో వివిధ రకాల బస్సులు మొత్తం 1200సర్వీసులున్నాయి. వీటన్నింటికీ రూ.5 ప్యాసెంజర్ సెస్, రక్షణ సెస్ కింద మరో రూ.1, టికెెట్ రౌండప్ పేరుతో మరో రూ.5 వరకూ పెరిగాయి. ఉమ్మడి జిల్లా నుంచి నిత్యం 1.40 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లా డిపోలకు ప్రత్యేకంగా 445 సర్వీసులు వేశారు. వీటికి అదనపు చార్జీ వసూలు చేయకపోయినా వివిధ కారణాలతో ఇప్పటికే చార్జీలు పెంచడంతో ఎక్స్‌ప్రెస్ మొదలు ఏసీ బస్సు వరకూ ఈ ఏడాది కాలంలో రూ.50 నుంచి వంద వరకూ పెంపుదల చోటుచేసుకుంది. వీటికితోడు విద్యుత్ చార్జీలు కూడా గతేడాదితో పోలిస్తే పెరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4.14 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఒక్కో వినియోగదారుపై రూ.50 వరకూ అదనపు భారం పడుతుంది. నెలకు రూ.20 కోట్లకు పైగా భారం మోయాల్సి వస్తుంది. ఇక పెట్రోల్ విషయానికొస్తే రోజుకు 2లక్షల లీటర్లు వాడుతున్నారు. గతేడాది డిసెంబర్ చివరి నాటికి రూ.98 ఉన్న ధర ఇప్పుడు రూ.112 వరకూ చేరింది. రోజుకు 28లక్షల అదనపు భారం ప్రజలపై పడుతుంది.
- అప్పల తిప్పలు...
పండగంటే పిండివంటలు. పెరిగిన ధరలతో పండుగకు పిండి వంటలు చేసుకునే స్తోమత లేక సామాన్యులు వాటిజోలికి వెళ్లలేని పరిస్థితి ఉంది. గతంతో పోల్చితే ఏ పిండి రేటైనా రూ.20కి పైగా పెరిగింది. నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో రోజువారీగా లక్ష లీటర్ల నూనె వినియోగిస్తారని ఓ అంచనా. నెలకు ఓ కుటుంబం నాలుగు కిలోల చొప్పున వినియోగిస్తే లీటర్‌కు రూ.50 చొప్పున రూ.200 అదనపు భారం పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది రూ.140 వరకు ఉన్న పొద్దుతిరుగుడు నూనె ఇప్పుడు రూ.210, వేరుశెనగ రూ.180 నుంచి రూ.230, పామాయిల్ రూ.120 నుంచి 170కి పెరిగాయి. అయితే నూనెల ధరలను 2 నుంచి 11% మేర తగ్గిస్తూ కేంద్రం నాలుగురోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ధరలు ఇంకా రిటైల్ మార్కెట్లో అమలు కావట్లేదు. పిండి విషయానికొస్తే బియ్యం పిండి రూ.30 ఉండేది రూ.40, గోధుమ పిండి రూ.50 ఉండేది రూ.60, శెనగపిండి రూ.60 నుంచి రూ.80, మైదా పిండి రూ.60 నుంచి 80కి పెరిగింది. విచ్చలవిడి ధరల పెంపుతో సామాన్యులు పండుగ పూట కూడా పస్తులుండాల్సి వస్తుంది.
- పండుగ మరిచి ఎన్నో ఏళ్లయింది...
విమల, 58వ డివిజన్, ఖమ్మం
పెరిగిన ధరలతో పండుగ చేసుకోలేకపోతున్నాం. ఒక్కోసారి పండుగలప్పుడు కూడా పస్తులుండాల్సి వస్తుంది. నేను టైలరింగ్ చేస్తా. నా భర్త మద్యానికి బానిసయ్యాడు. ఇద్దరు పిల్లల బాగోగులు నేనే చూసుకోవాలి. రెడిమేడ్ రాకతో మా దగ్గర కుట్టించే వారు కరువయ్యారు. పిల్లల చదువు, రూం రెంట్లు, కరెంట్ బిల్లు, తిండీ తిప్పలు...పెరిగిన ధరలతో ఎంత పొదుపు చేసినా కుటుంబ పోషణకు నెలకు రూ.15వేల ఖర్చు వస్తుంది. ఆదాయం మాత్రం రూ.10వేలు కూడా ఉండట్లేదు. రూమ్ కిరాయిలకే రూ.4వేలు పోతే ఆరువేలతోని మాకెట్లా వెళ్లాలి. పండుగలు మరిచి ఏళ్లయింది. డబుల్ బెడ్రూం ఇస్తేనన్నా కిరాయి తప్పుతుందంటే ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇవ్వట్లేదు.