Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు నేటికీ బ్యాంక్ ఖాతాలో జమ కానీ నష్ట పరిహారం సొమ్ము
- పేర్లు నమోదులో పొరపాట్లు కారణమా....
- ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాని వైనం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి వరదలతో నీట మునిగిన ముంపు బాధితులకు ప్రభుత్వం అందజేసే రూ.10 వేల నష్టపరిహారం పై గందరగోళ పరిస్థితులు వీడడం లేదు. గోదావరి వరదలతో నిండా మునిగిన మాకు నష్ట పరిహారం డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు అంటూ కొంత మంది వరద బాధిత కుటుంబాలు నేటికీ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలోని ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని నవతెలంగాణ ముందు వారు వాపోయారు.
ఈ ఏడాది జులై నెలలో వచ్చిన గోదావరి వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న పలు గ్రామాలు వరద ముంపుతో సర్వం కోల్పోయారు. దీంతో ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేం దుకు అధికారులతో ముంపు సర్వే నిర్వహించారు. సర్వే సమయంలో అధికారులు తప్పుల తడకగా సర్వే నిర్వహించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. మండల వ్యాప్తంగా మొత్తం 23 ముంపు గ్రామాలలో 1936 మంది వరద బాధితులను అధికారులు గుర్తించి వారి వద్ద నుండి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకుని ఆన్లైన్ చేశారు. వెను వెంటనే గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తామని చెప్పిన పది వేల రూపాయల నష్టపరిహారం బాధితుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. వారిలో కొంతమంది వరద బాధితులు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదని, తమ పేర్లు నమోదు చేయలేదని తాసిల్దార్ కార్యాలయం వద్ద అనేక మార్లు ఆందోళన చేపట్టి వినతి పత్రాలు అందజేశారు. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానీ వరద బాధితులకు చెందిన బ్యాంక్ ఖాతాలు, ఐఎఫ్సి కోడ్ వంటి వివరాలను తీసుకుని కరెక్షన్ చేసి తిరిగి మరలా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లిస్టు అందజేశారు. కాగా రెండవ విడత 386 మంది లబ్ధిదారులకు గుర్తించారు. ముంపు సర్వేలో అధికారులు చేసిన తప్పిదాలతో పాటు ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసిన సమయంలో తప్పుల తడకగా నమోదు చేయడం వంటి పొరపాటు వలన నిజమైన ముంపు బాధితులకు నేటికీ నష్ట పరిహారం అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదులు
గోదావరి వరదలతో తాము తీవ్రంగా నష్టపోయామని తమ బ్యాంకు ఖాతాలో నేటికీ నష్టపరిహారం సొమ్ము జమ కాలేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సైతం వరద బాధిత కుటుంబాలు ఫిర్యాదులు చేశారు. దుమ్ముగూడెం గ్రామానికి చెందిన సుమారు పది బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు అంటూ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సున్నం బట్టి, బై రాగులపాడు, ఎల్ఎన్ రావు పేట గ్రామాలకు చెందిన 20 కుటుంబాలకు చెందిన బాధితులు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు ఫిర్యాదు చేశారు. కాగా కలెక్టర్ వారి వద్ద నుండి బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆధార్ కార్డు జిరాక్సులు సైతం తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. రెండవ విడత నమోదు పక్రియలో 386 మంది వరద బాధితులను గుర్తించినప్పటికీ వారిలో ఏ ఒక్కరికి నేటికీ నష్ట పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతా లో జమ కాలేదు..
టెక్నికల్ సమస్యే కారణమా
టెక్నికల్ గా తలెత్తిన సమస్య వల్లనే కొంత మంది వరద బాధిత కుటుంబాలకు నేటికీ నష్ట పరిహారం అందక పోవడానికి కారణమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెవిన్యూ అధికారులు సైతం ఎంతమంది ముంపు బాధితులకు నష్టపరిహారం సొమ్ము వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఇంకా ఎంత మందికి నష్ట పరిహారం సొమ్ము చెల్లించాలి అనే లెక్కలు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారని చెప్పవచ్చు. ముంపు బాధితులకు తమ వద్ద జమ అయినట్లు చూపిస్తుందని రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా గోదావరి ముంపు నష్ట పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ పై గందరగోళ పరిస్థితి నెలకొంది అనే చెప్పవచ్చు.