Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొట్టుకుపోయిన రెండు లక్షల విలువైన సామగ్రి
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం ఈ బయ్యారం పంచాయతీలో ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రవాహం రోజు రోజుకు పెరుగుతూ తీరం కోతకు గురవుతుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వాగు ప్రవాహం పెరగడంతో పెద్దవాగు సమీపంలో గల డాబా ఇల్లు వాగు ప్రవాహానికి పూర్తిస్థాయిలో కూలిపోయింది. ఇంటి యజమాని బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం రాత్రి కురిసిన వర్షానికి వాగు ప్రవాహం వల్ల ఇల్లు కూలిపోయి, ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం వాగు వరదలో కొట్టుకుని పోయిందన్నారు. సుమారు రూ.రెండు లక్షల విలువ చేసే సామాగ్రి సైతం కొట్టుకుపోయిందని తెలిపారు. ఇంట్లో నిద్రిస్తుండగా గోడ కూలడంతో తప్పించుకునే ప్రయత్నంలో తనకు కూడా గాయమైనట్లు తెలిపారు. ఈ విషయం వెంటనే స్పందించిన తహసీల్దార్ విక్రమ్ కుమార్ ఆదేశాలతో సంఘటన స్థలానికి రెవెన్యూ అధికారులు చేరుకొని నష్టం అంచనా వేసి తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతంలో నష్టపోతున్న వీరికి ఇంటి స్థలాలు కూడా కేటాయించినట్లు తహసీల్దార్ విక్రమ్ కుమార్ తెలియజేశారు.