Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులు అర్పించిన సీపీఐ(ఎం), యూటీఎఫ్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సానుభూతిపరురాలు, యూటీఎఫ్ మాజీ నాయకురాలు, సీపీఐ(ఎం) నాయకులు కె.మోహన్ రావు సతీమణి కె.లలిత కుమారి (80) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. లలిత కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందారని వార్త తెలుసుకున్న సీపీఐ(ఎం), యూటీఎఫ్, టీఆర్ఎస్, సీపీఐలతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు తరలి వచ్చి ఆమె భౌతిక కాయం వద్ద పూలమాలలు నుంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లలిత కుమారి ఉపాధ్యాయురాలిగా తన స్థానంలో ఎంతో మందిని తీర్చిదిద్దిన ఉన్నతమైన గురువు అని కొనియాడారు. లలిత కుమారికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు. భర్త మోహన్ రావు ఉపాధ్యాయుడిగా, యూటీఎఫ్ నాయకుడిగా, ఉద్యోగ విరమణ అనంతరం సీపీఐ(ఎం)లో క్రియాశీలకంగా పని చేసి పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సీతారాంపురం ఎంపీటీసీ యలమంచిలి వంశీ కృష్ణ, నాయకులు మర్మం చంద్రయ్య, రాయపూడి యేసు రత్నం, కొడాలి లోకేష్ బాబు, పూజారి సూర్యచంద్రరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఏ.సత్య నారాయణ మూర్తి, సీపీఐ నాయకులు బొల్లోజు వేణు, యుటిఎఫ్ మండల కార్యదర్శి సంగం శ్రీనివాసరావు, నాయకులు బాలునాయక్, రంగయ్యతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు.