Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై రెవిన్యూ, పోలీస్, విద్యా, వైద్య, విద్యుత్ తదితర అధికారులతో పాటు పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్‌తో గురువారం టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సర్వీసులో గ్రూప్-1 పరీక్ష చాలా కీలకమైనదని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. మన జిల్లాలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు కొత్తగూడెంలో 10, లక్ష్మీదేవిపల్లిలో 5, పాల్వంచలో 7 మొత్తం 22 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలల్లో 11 ప్రభుత్వ విద్యాలయాలు కాగా 11 ప్రైవేట్ విద్యాలయాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులు పరీక్షలు రాసేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యుయల్ డస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లును పరిశీలించి ఆయా మండలాల తహసిల్దారులు నివేదికలు అందచేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షిత మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా తయారు చేయాలని పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర చికిత్సలు నిర్వహణకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు తగినన్ని మందులను సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా హాలులో తప్పని సరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఛీఫ్ సూపరింటెండ్ పర్యవేక్షణకు హాలులో కూడా సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షా సజావుగా, సక్రమంగా నిర్వహించుటకు ఆయా కేంద్రాలలో 144 సెక్షన్ విధించాలని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి పరీక్షలు అభ్యర్థులు హాజరవుతున్నందున సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టిసి అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లుపై 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఆయా శాఖల అధికారులకు అప్పగించిన విధులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలతో హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆయా మండల తహసిల్దారులు, పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.