Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపయోగంగా సీతానగరం ఎత్తిపోతల పథకం
- పనిచేయని మోటార్లు
- పగిలిన ఇనుప పైపులు
నవతెలంగాణ -బోనకల్
అధికారుల నిర్లక్ష్యంతో సీతానగరం ఎత్తిపోతల పథకం 8 ఏళ్లుగా నిరు పయోగంగా మారింది. దీంతో రైతులు సాగునీరు వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోనే సీతానగరం ఎత్తిపోతల పథకాన్ని ఆనాటి మధిర ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు రైతుల కోరిక మేరకు సీతానగరంలోనే పెద్దవాగుపై సీతానగరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం కింద సుమారు 80 మంది రైతులకు చెందిన 280 ఎకరాలు సాగవుతుంది. ఇందులో మెట్ట, మాగాని పొలాలు కూడా ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకానికి మొత్తం మూడు మోటార్లను అమర్చారు. పథకాన్ని ఆనాడు ఏపీ ఐడీసీ విధులతో నిర్మించారు. ప్రస్తుతం ఈ పథకం పూర్తిగా మూలన పడింది. ఈ ఎత్తిపోతల పథకానికి గల మూడు మోటార్లలో రెండు మోటార్లు గత ఎనిమిది ఏళ్ల నుంచి పనిచేయడం లేదు. 1160 మీటర్ల నీటి సరఫరా పైప్ లైన్ చాలావరకు పగిలిపోయాయి. ఈ పైపులైన్లు సిమెంటు పైప్లైన్లు కావటంతో ఏ మాత్రం ఒత్తిడి జరిగినా పగిలిపోతున్నాయి. అదేవిధంగా ఎత్తిపోతల పథకానికి అమర్చిన ఇనుప పైపులైన్లు కూడా తుప్పు వచ్చి పగిలిపోయాయి. దీంతో ఈ ఎత్తిపోతల పథకం కింద 280 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతులందరూ సన్నా, చిన్న కారు రైతులు కావడం విశేషం. అయితే ఈ పేద రైతులు ఈ పొలము పైన ఆధారపడి జీవిస్తుండటంతో మరో మార్గం లేక పెద్దవాగుకు కొంతమంది రైతులు కలిసి మోటర్లు ఏర్పాటు చేసుకొని పంటలు పండించుకుంటున్నారు. ఈ 280 ఎకరాలలో సుమారు 100 ఎకరాల వరకు మాగాని పొలము ఉంది. ఈ పొలానికి ఆధారం ఎత్తిపోతల పథకమే. కానీ ఎత్తిపోతల పథకం పనిచేయకపోవడంతో ఈ 100 ఎకరాలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. అయితే కొంతమంది రైతులు పెద్దవాగుకు మోటార్లు పెట్టి సాగునీటి వసతి కల్పించుకున్నా పూర్తిస్థాయిలో సాగునీటి వసతి లేక మధ్యలోనే వరి పంట కూడా ఎండిపోతుంది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాలుగు ఎకరాలలో పంటలు సాగు చేశా :చిలక వెంకటేశ్వర్లు, రైతు, సీతానగరం
సీతానగరం ఎత్తిపోతల పథకం కింద తనకు గల నాలుగు ఎకరాలలో మిర్చి, వరి, పత్తి పంటలను సాగు చేశాను. సీతానగరం ఎత్తిపోతల పథకం పనిచేయక పోవడంతో పెద్దవాగుకు మోటార్ల ద్వారా సాగునీటిని పెట్టుకుంటున్నాను. కానీ పంటలు పెద్ద ఆశాజనకంగా లేవు. వర్షాల ఆధారంగానే ఎక్కువ భాగం ఈ పంటలు సాగు చేసుకోవాల్సి ఉంది. సరైన సమయంలో సాగునీటి వసతి లేక సగం పంట మాత్రమే మంచిగా ఉంది. ఎత్తిపోతల పథకం పనిచేస్తున్న సమయంలో పూర్తిస్థాయిలో పంట చేతికి వచ్చింది. అనేక మంది రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.