Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే
- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్సీ, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-ఇల్లందు
ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ, భర్త మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్ నాయక్‌లు తొలిసారిగా తల్లిదండ్రులు అయ్యారు. దసరా పండుగ రోజు బుధవారం ఉదయం ఆరు గంటల 40 నిమిషాలకు పట్టణంలోని ఆమ్ బజార్లో ఉన్న రావూస్ సూపర్ స్పెషాలిటీ ప్రయివేటు ఆస్పత్రిలో ఎమ్మెల్యే హరిప్రియ డెలివరీ అయ్యారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. డాక్టర్ కల్పన, డాక్టర్ రవి కుమార్ మరి కొందరు వైద్యుల సారధ్యంలో ప్రసూతి నిర్వహించారు. తొలిసారిగా పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో బంధువులు, కార్యకర్తలు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. దసరా పండగ రోజు అయినప్పటికీ ఇల్లందు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ప్రముఖులు, వివిధ పార్టీల నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు ఇల్లందుకు వచ్చి ఎమ్మెల్యేను, పాపని చూసి ఆనందించారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి అజరు కుమార్ ఫోన్లో ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్‌లను పరామర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ హాస్పిటల్‌కు వచ్చి ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మండల ఇన్చార్జ్ యలమద్ది రవి, మరికొందరు ప్రముఖులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పలువురు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అంటూ తప్పుడు ప్రచారం
వాస్తవానికి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందులోని రావుస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జాయిన్ అయి అదే ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నాయకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద పీట వేయడానికి నిదర్శనం ఈ ఘటన అంటూ హౌరెత్తించారు. అంతేకాదు దీనికి నిదర్శనంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వసతులు మెరుగయ్యాయని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జాయింట్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి కలెక్టర్ సతీమణి, ఇప్పుడు ఎమ్మెల్యే హరిప్రియ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకుని ఆదర్శంగా నిలిచారంటూ తెగ పోస్టులు పెట్టడం గమనార్హం.