Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమ ప్రాంగణంలోనే వాహనదారులకు సౌకర్యాలు
- పరిశ్రమ మేనేజర్‌తో భేటీ అయిన కార్యదర్శి కోటగిరి
నవతెలంగాణ-అశ్వారావుపేట
నిర్మాణంలో ఉన్న ప్లాట్ ఫామ్, వే బ్రిడ్జి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలంగాణ పామ్ ఆయిల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కోటగిరి సీతారామ స్వామి ఆయిల్‌ఫెడ్ ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్, పరిశ్రమ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణను కోరారు. నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యాక మొదటి సారిగా మంగళవారం పలువురు డైరెక్టర్లతో ఆయన మేనేజర్‌తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ముందుగా అధ్యక్షులు ఆలపాటి రాం చంద్ర ప్రసాద్‌తో కలిసి దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెంలో గల స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వగృహంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించిన అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే చేయాల్సిన పరిష్కారాలను చర్చించారు. గత నెల 29, 30 తేదీలలో సేకరించిన గెలలు అనివార్య కారణాలతో అక్టోబర్ 1న దిగుమతి చేసుకున్న గెలలకు సైతం సెప్టెంబర్ ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డితో ఫోన్లో అభ్యర్థించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం అశ్వారావుపేట పరిశ్రమకు చేరుకుని ఈ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలించారు. గెలలు పరిశ్రమలకు తరలించిన వాహన డ్రైవర్లకు, ఇతర పనులపై వచ్చిన రైతులకు పరిశ్రమ ప్రాంగణంలోనే విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు స్పందించిన మేనేజర్ బాలక్రిష్ణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్యదర్శి శీమకుర్తి వెంకటేశ్వరరావు, అసోసియేషన్ డైరెక్టర్ కాసాని చంద్రమోహన్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, రైతులు కొండవీటి వాసుదేవరావు, కొల్లు వెంకటరమణలు పాల్గొన్నారు.