Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 1న భద్రాచలంలో సీఐటీయూ బహిరంగ సభ
- జిల్లా ఉపాధ్యక్షులు కే.బ్రహ్మాచారి
నవతెలంగాణ-చర్ల
ఆశ కార్యకర్తలు తమ సమస్యలపై అలుపులేని పోరాటాలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే. బ్రహ్మచారి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నవంబర్ ఒకటో తేదీన భద్రాచలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, కార్మిక ప్రదర్శన జరుగుతుందని ఈ బహిరంగ సభకు ఆశా వర్కర్లు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. సీఐటీయూ జిల్లా మూడవ మహాసభలు నవంబర్ 1, 2 తేదీలలో భద్రాచలం పట్టణంలో జరుగుతున్నాయని ఈ మహాసభల సందర్భంగా ఒకటవ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. చర్ల, సత్యనారాయణపురం గ్రామాలలో జరిగిన ఆశ వర్కర్ల సమావేశంలో బ్రహ్మచారి మాట్లాడారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధరలను పెంచి కార్మిక వర్గంపై ఆర్థిక భారాలు వేస్తుందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ప్రసూతి విభాగంలో డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు లేని కారణంగా ప్రసవానికి వచ్చిన గర్భిణీలను కొత్తగూడెం, ఖమ్మం పంపిస్తున్నారని అంత దూరం వెళ్ళటానికి తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని సీఐటీయూ పేర్కొన్నది. ప్రభుత్వం వెంటనే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ప్రసూతి విభాగానికి అవసరమైన 12 మంది డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా మహాసభల్లో జిల్లాలోని కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తారని తెలిపారు. నవంబర్ 1న జరిగే బహిరంగ సభకు సీఐటీయూ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని సీఐటీయూ తెలిపింది. మహాసభల విజయవంతానికి అన్ని రంగాల కార్మికులు, కార్మిక శ్రేయోభిలాషులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశాల్లో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు ఉషారాణి, హైమావతి, కళ్యాణి, రాంబాయి, కాంతమ్మ, ఉమా, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.