Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబీ.నర్సారెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబీ.నర్సారెడ్డి అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణం నెహ్రూ మార్కెట్, పాత మార్కెట్ ఫుట్పాత్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కూరగాయలు, ఇతర చిన్న చిన్న వడ్డీలు పెట్టుకుంటూ రోడ్డు పక్కన ఫుట్పాత్ వ్యాపారం చేస్తున్న కార్మికులు అంతకు ముందు కరోనా, తర్వాత కాలంలో వరదలు, ఈ మధ్యకాలంలో తుఫానులు కారణంగా సరిగా వ్యాపారాలు లేక డైలీ ఫైనాన్స్ కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ రుణాలు ద్వారా ఆర్థిక సహకారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫుట్పాత్ కార్మికులకు ఉచిత ఇన్సూరెన్స్, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని, నెహ్రూ మార్కెట్ లోపల ఏర్పాటుచేసిన గ్రామపంచాయతీ పార్కును వినియోగంలోకి తీసుకురావాలని తదితర సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఫుట్పాత్ కార్మికుల నూతన కమిటీని 11 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా సత్యవేణి, కార్యదర్శిగా కె.కళావతి, సహాయ కార్యదర్శిగా విష్ణు, ఉపాధ్యక్షులుగా నస్రిన్, కోశాధికారిగా సుబ్రహ్మణ్యంలను నియమించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక, సీఐటీయూ పట్టణ నాయకులు ఎం.నాగరాజు, జి.లక్ష్మీకాంత్, సిహెచ్ మాధవరావు, పి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.