Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ స్థలాల స్వాధీనం పేరుతో పేదల బతుకులు ఛిన్నాభిన్నం
- పాతరైతుబజార్, చేపలమార్కెట్ కూల్చివేతతో రోడ్డునపడ్డ జీవితాలు
- వ్యాపారాలు సరిగా సాగక వీధిన పడ్డ చిరువ్యాపారులు, రైతులు
- నిరుపయోగంగా పాతబస్టాండ్... పరిసరాల్లో దెబ్బతిన్న వ్యాపారాలు
- పెద్దల చేతుల్లో ఉన్న జాగాలను వదిలి బడుగుజీవులపై జులుం
- అద్దెపేరుతో కార్పొరేట్లు, పెద్దలకు కట్టబెట్టే యత్నంలో భాగమేనా...?
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలో విలువైన ప్రభుత్వ స్థలాలను పెద్దలు కాజేస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించే నగర పాలకసంస్థ అధికారులు...పేదలపై మాత్రం జులుం విదుల్చు తున్నారు. బతుకుదెరువైన మార్కెట్లను కూల్చివేసి బడుగుజీవులను బజారుకీడ్చుతున్నారు. విలువైన ఎన్నెస్పీ స్థలాల్లో పెద్దలు పాగా వేసినా గజం కూడా కదల్చని అధికారులు రైతుబజార్లు, చేపలమార్కెట్ల వంటివాటిని కూల్చివేసి చిరువ్యాపారుల పొట్టకొడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఆర్డీవో ఆఫీసు పక్కన పాత రైతుబజార్లో కూరగాయలమ్ముకున్న రైతుల వీధిన పడేశారు. గతేడాది రైతుబజార్‌ను కూలగొట్టడంతో వందలాది మంది రైతులు బతుకుదెరువు కోల్పోయారు. నిత్య కలహాల మధ్య పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో అమ్మకాలు సాగిస్తున్నారు. వందలాది మందికి ఆదరువుగా ఉన్న వైరారోడ్డులోని చేపలు, మాంసం మార్కెట్, దానికి ఆనుకుని ఉన్న చిన్నపాటి ఫర్నిచర్, ఎలక్ట్రికల్, చికెన్‌సెంటర్లు తదితర షాపులను నిన్నటికి నిన్న నేలమట్టం చేశారు. మరోవైపు ఏడాదిన్నర క్రితం పాతబస్టాండ్‌ను ఎత్తివేయడంతో అదీ నిరుపయోగంగా మారింది. దాని ఆధారంగా జీవించే వందలాది మంది చిరు వ్యాపారుల బతుకు చిన్నబోయింది. ఒకప్పుడు రోజుకు రూ.10వేలకు పైగా వ్యాపారం నడిస్తే నేడు రూ.3వేలకు మించి సాగట్లేదని వాపోతున్నారు.
వట్టిపోతున్న వన్‌టౌన్
40 ఏళ్లుగా వన్‌టౌన్ ప్రాంతం వ్యాపార నిలయంగా ఉండేది. వేలాది మంది వివిధ రకాల దుకాణాలు నిర్వహించేవారు. వీరిలో అత్యధికులు చిరువ్యాపారులే ఉండేవారు. ఎప్పుడైతే పాతబస్టాండ్‌కు మూతవేశారో వారంతా వీధిపాలయ్యారు. ముఖ్యంగా స్టేషన్‌రోడ్డు, బమ్మన సెంటర్, వైరారోడ్డు ప్రాంతాల అభివృద్ధి పాతబస్టాండ్పై ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతమంతా వెలవెలబోతుంది. ఫ్రూట్స్టాల్స్, ఫుట్వేర్లు, ఎలక్ట్రికల్, ఫ్యాన్సీ, మొబైల్ షాప్స్, మెడికల్, వాచ్ షాప్స్, సినిమా హాళు, చిన్నపాటి వస్త్ర దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఇలా అన్నీ దివాళా తీశాయి. కొద్దిరోజుల క్రితం కార్పొరేషన్ కార్యాలయం తరలిపోగా...ఇప్పుడు చేపలు, మాంసం మార్కెట్‌ను కూడా నామరూపాలు లేకుండా చేయడంతో బతుకులన్నీ బజారునపడ్డాయి. విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి చేపలు, పొట్టేళ్లను తెచ్చి హౌల్‌సేల్, రిటైల్‌గా మాంసం విక్రయించే వ్యాపారులు సుమారు వంద మంది వరకు వీధినపడ్డారు. మున్సిపాల్టీ ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరింది అనే పేరుతో సోమవారం రాత్రి కూల్చివేయడంతో 20 మందికి పైగా చిరువ్యాపారులు దిక్కులేనివారయ్యారు. అద్దెలు, శిస్తులు చెల్లిస్తున్నా పేదల పొట్టకొడుతుండటంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాత డీఈవో కార్యాలయం, రైల్వేస్టేషన్ ఎదురుగా హెల్త్‌సెంటర్, పాతసబ్జైల్, ఎకరాల కొద్దీ ఎన్నెస్పీ క్వార్టర్స్ స్థలాలు వృథాగా ఉంటున్నా సద్వినియోగం చేసుకోని ప్రభుత్వం వైరారోడ్డులోని చేపలు, మాంసం మార్కెట్ స్థలం స్వాధీనం వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ వస్త్ర దుకాణాలు, హాస్పిటల్స్‌కు స్థలాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడమో లేదంటే కమర్షియల్ బిల్డింగ్లు నిర్మించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే తలంపుతోనే ప్రభుత్వ పెద్దలు పర్సంటేజీలకు కక్కుర్తి పడి ఈ గ'లీజు' వ్యవహారానికి పాల్పడ్డారనే ప్రచారం జరుగుతోంది. పాత రైతుబజార్‌ను అమేజాన్ అనే సంస్థకు, పాతబస్టాండ్‌ను యశోద హాస్పిటల్స్‌కు అప్పగిస్తారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా ఆ యోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా ఇవి కార్పొరేట్ల పాలుకాక తప్పదనే వాదన వినిపిస్తోంది.
అడ్డామార్చడంతో అప్పుల పాలయ్యాం...
ఎస్. సరోజన, చేపల వ్యాపారి, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్
వైరారోడ్డు చేపల మార్కెట్లో 40 ఏళ్లపాటు చేపలమ్మాను. రెండేళ్ల క్రితం అక్కడ ఖాళీ చేయించారు. కొత్తబస్టాండ్ పక్కనే ఉంటుందంటూ ఇక్కడికి పంపించారు. కటికోళ్లు లేవలేదు. మమ్మల్నే ఇక్కడికి తోలిండ్రు. అక్కడున్నప్పుడు రోజుకు క్వింటా చేపలమ్మే దాణ్ణి. ఇక్కడికొచ్చినంక అరక్వింటా కూడా అమ్ముడుపోవట్లే. ఒక్కోసారి అరముక్క పెద్ద చేపలు అట్లనే మిగుల్తున్నాయి. తీసుకుపోయి వండుకుంటున్నాం. చుట్టుపక్కలోళ్లకు అగ్గువకు ఇస్తున్నాం. ఆడినుంచి ఈడికి 20 మందికి పైగా వచ్చినం. అమ్మకాలు లేక.. అప్పులు పాలై.. బేరాలు చేయలేక పది మందికి పైగా చేపల అమ్మకం వదిలిపెట్టిండ్రు. నాకు వేరే పనిచేత కాదు కాబట్టి చేపలే అమ్ముతున్నా.
పాతబస్టాండ్ పోవడంతో
సగం వ్యాపారం సాగట్లే... పాదుళ్ల, ఫుట్‌వేర్ షాప్, స్టేషన్‌రోడ్డు
ఏడేళ్లుగా స్టేషన్‌రోడ్డులో వ్యాపారం చేస్తున్నా. పాతబస్టాండ్ ఉన్నప్పుడు రోజుకు రూ.ఆరేడువేలు అమ్మేటోన్ని. ఇప్పుడు రూ.2వేల లోపే అమ్ముతున్నా. బస్టాండ్ ఎత్తివేయడంతో పల్లెలు, పట్టణాల నుంచి వచ్చేవారు ఇప్పుడు ఇటు రావట్లే. తిండీ బట్టమందం కూడా వ్యాపారం లేదు. బందు పెట్టుకుంటే ఈ మాత్రం బతుకుదెరువు కూడా ఉండదేమోనని కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. కనీసం పల్లెవెలుగు బస్సులైనా పాతబస్టాండ్‌కు వచ్చేలా చూడాలి.