Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిఖం భూమికి హద్దులు నిర్ణయించిన అధికారులు
- పాతిన హద్దురాళ్లను ధ్వంసం
- శిఖం భూమిలోని రోడ్డును తవ్వించిన అధికారులు
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి పెద్దచెరువు శిఖం భూమి సర్వే ఉద్రిక్తత పరిస్ధితులకు దారితీసింది. మంగళవారం రెవిన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ బంద్ బస్తు మధ్య కారేపల్లి పెద్ద చెరువు శిఖం భూమి హద్దు నిర్ణయించి హద్దు రాళ్ళను పాతారు. ఈ సమయంలో తమ భూమి అంటూ కొందరు అధికారులతో వాగ్వివాదం దిగారు. సర్వే ప్రకారం ఈ భూమి శిఖం భూమిగా తేలిందని, ఏదైనా ఉంటే సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్ధార్ రవికుమార్ రైతులకు సూచించారు. పోలీసు బందో బస్తు మధ్య శిఖం భూమికి హద్దులు పాతిన అనంతరం అధికారులు తిరుగు ప్రయాణం అవ్వగానే కొందరు వ్యక్తులు హద్దురాళ్లను ధ్వంసం చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఆర్డీవో రవీంధ్రనాద్, ఏసీపీ బస్వారెడ్డి కారేపల్లి పెద్ద చెరువు ప్రాంతాన్ని సందర్శించి ధ్వంసం చేసిన హద్దురాళ్లను పరిశీలించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు.
భారీ బందోబస్తుతో శిఖంలో వేసిన రోడ్డు తొలగింపు
శిఖం హద్దులు ధ్వంసం చేయటంతో సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఖమ్మం రూరల్ ఏసీపీ పరిధిలోని సీఐ అరిఫ్అలీఖాన్, ఎస్సైలు పోలోజు కుశకుమార్, కిరణ్‌కుమార్, మాచినేని రవికుమార్, ఆర్.స్రవంతిలతో పాటు పోలీసు సిబ్బంధిని కారేపల్లి పెద్ద చెరువు ప్రాంతంలోని తులిశ్యాతండా వద్దకు చేర్చారు. శిఖం భూమిలో కొందరు రైతులు తమ పంట పొలాలకు వెళ్లాటానికి గతంలో అధికారులు అనుమతులు లేకుండా రోడ్డును వేసుకున్నారు. ఆ రోడ్డు దాని పక్కన ఉన్న పంట భూములు సర్వేలో శిఖం భూములుగా తేలటంతో వెంటనే జేసీబీలతో రోడ్డును తవ్వించారు.
అక్రమణలతో కుశించిన కారేపల్లి పెద్ద చెరువు
కారేపల్లి పెద్ద చెరువు సర్వే నెం. 432లో 184 ఎకరాల్లో ఉండగా దానిని కొందరు అక్రమిస్తూ వస్తున్నారు.60 ఎకరాలకు పైగా శిఖం భూమిని కబ్జాకు గురైందని చెరువుపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు 122 రోజులుగా అందోళన చేస్తున్నారు. చెరువు వద్దే టెంటు వేసుకొని రిలేదీక్షలు చేస్తున్నారు. ఇటీవల కారేపల్లి వచ్చిన కలెక్టర్‌కు సమస్యను తెల్పటంతో కలెక్టర్ సైతం శిఖం భూములను పరిశీలించి వెంటనే సర్వే పూర్తి చేసి హద్దులు వేయాలని తహసీల్ధార్ రవికుమార్‌ను ఆదేశించారు. దీంతో సర్వే చేసిన అధికారులు 184 ఎకరాల శిఖం భూమకి హద్దులు నిర్ణయించగా సాగు చేస్తున్న భూమి, తులిశ్యాతండాకు చెందిన ఇండ్లు సైతం శిఖం భూమిలో ఉన్నట్లు తేలింది. సర్వేలో సర్వే శాఖ ఏడీ రాము, ఐబీ ఈఈ, డీఈ వెంకన్ననాయక్, తదితరులు ఉన్నారు.