Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు
- పోలీస్ అధికారులతో సమావేశంలో ఎస్పీ
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, పరీక్షలకు హాజరయ్యే ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని ఎస్పీ వినీత్.జీ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ నియమావళి ప్రకారం పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి జనాలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని ఫోటో స్టూడియోలు, జిరాక్స్, పాన్, ఇతర షాపులు ముందుగానే మూసి ఉంచేలా దుకాణదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, గుండాల, ఇల్లందు మండలాల నుండి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆర్టీసీ యాజమాన్యం సహకారంతో ప్రత్యేకంగా బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని చెప్పారు. గ్రూప్-1 క్రిమినరీ పరీక్ష సజావుగా సాగేందుకు సమన్వయకర్తగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పి డి.శ్రీనివాసరావు, కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి, పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.