Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో ''తొలిమెట్టు'' (మౌలిక భాషా, గణిత సామర్థ్యాల సాధన) కార్యక్రమం అమలు తీరుపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం హైద్రాబాద్ నుండి ఆన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, మండల నోడల్ అధికారులు, సెక్టరియల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 15వ తేది నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ''తొలిమెట్టు'' కార్యక్రమంలో భాగంగా పాఠశాల బోధనాభ్యాసన ప్రక్రియలో గుణాత్మక మార్పు కనబడాలని, దీనికై జిల్లా స్థాయి, మండల స్థాయి పర్యవేక్షక బృందాలు సమర్థ నాయకత్వం వహించి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరచాలన్నారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులలో పఠన నైపుణ్యాలను పెంపొందించడానికి వివిధ గ్రామాలలో గల గ్రంథాలయాలను అభివృద్ధి పరచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. తొలిమెట్టు అమలుపై ఈ నెల 15వ తేదీ నుండి 31వ తేది వరకు రోజువారీ కార్యక్రమాల షెడ్యుల్‌ను తయారు చేసి, అమలు సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, ఇరిగేషన్, పీఆర్, ర.భ, ఐ.డబ్ల్యుసీ ఇంజినీరింగ్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.