Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను నిండా ముంచిన 'సోనం' వరి సీడ్ విత్తన కంపెనీ
- లబో దిబోమంటున్న బాధిత రైతులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కార్పొరేట్ విత్తన కంపెనీలు ఏజెన్సీ ప్రాంత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కల్తీ వరి, పత్తి, మిర్చి వంటి విత్తనాలను అంట కడుతుంటారు. నారుపోసి మొక్క వేసి పంట చేతికి వచ్చే సమయంలో అవి కల్తీ సీడ్ వంగడం అని తేలడంతో లబోదిబోమంటు రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తారు. దీంతో వ్యాపారులు సైతం విషయాన్ని సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని సెలవు ఇస్తారు. దీంతో రైతులు చేసేదిలేక కల్తీ విత్తన సాగుతో ప్రతి ఏడాది నష్ట పోతున్నారనే చెప్పవచ్చు.
మండల వ్యవసాయ అధికారులు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై ప్రత్యేక నిఘా పెట్టి చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ నకిలీ విత్తన, పురుగు మందుల సీడ్ కంపెనీలు చాటు మాటుగా పుట్టుకొస్తున్నాయి అనే చెప్పవచ్చు. కొన్ని విత్తనాల కంపెనీలు బ్రాండ్ ఉన్న కంపెనీలకు కమీషన్లు ముట్ట చెబుతూ వారి ద్వారాగా సీడ్ విత్తనం వంగడాలను రైతులకు అంట కడుతుంటారు. అదే తరహాలో ములక పాడు కేంద్రంగా నిర్వహిస్తున్న మన గ్రోమోర్ షాపు నిర్వాహకుల ద్వారా మండలంలోని చిన్న బండిరేవు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు 'సోనం' 1001 విత్తన వరి వంగడాలను 25 కేజీల ప్యాకెట్‌ను ఒక్కో ప్యాకెట్ రూ.850లకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన విత్తనాలతో బోడ లింగయ్య అనే రైతు 8 ఎకరాలు సాగు చేయగా, బొడ్డు శ్రీను 3 ఎకరాలు, బోడ నరసయ్య 3 ఎకరాలు, బోడ సూరమ్మ అనే మహిళా రైతు 4 ఎకరాలు వరి సాగు చేశారు. వీరితో పాటు మరికొంతమంది రైతులు సైతం సోనం కంపెనీకి వరి విత్తన సీడ్‌తో వరి సాగు చేశారు.
కల్తీ... ఫిఫ్టీ.. ఫిఫ్టీ
సోనం సీడ్ వరి విత్తన కంపెనీ వరి వంగడాలు 8 ఎకరాలు సాగు చేసిన బోడ లింగయ్య అనే రైతు వరి పొలాన్ని నవతెలంగాణ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వరి పొలం సగం బిర్రు పొట్ట దశలో ఉండగా, సగం వరి పొలం కంకులతో దర్శనమి స్తోంది. ఒక దశలో చెప్పాలంటే మూడు నెలల పంట అయినటువంటి 1010 వరి వేశారు. అదే విధంగా కల్తీలతో వరి పొలం మొత్తం దర్శనమిస్తోంది. కాగా ఈ విషయమై వ్యవసాయ అధికారి నవీన్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతులు నవతెలంగాణకు తెలిపారు. కల్తీ విషయమై నవతెలంగాణ మన గ్రోమోర్ మేజర్ వేణును వివరణ కోరగా బాధిత రైతులు విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని రెండు రోజుల్లో కంపెనీ ప్రతినిధులు వరి పంటను పరిశీలించి రైతుకు జరిగే నష్టాన్ని కంపెనీ బాధ్యత వహిస్తుందని ఆయన తెలిపారు.