Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పొనుకుల సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని కూసుమంచి రోడ్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి అక్కడి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యారంగ విధానాలు- విద్యార్థుల సమస్యలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత భవనం నుండి కళాశాలను నూతన భవనానికి మార్చినా విద్యార్థులను ఇంకా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయన్నారు. కళాశాల ప్రాంగణం గుంతల మయంగా మారడంతో వర్షం వచ్చినప్పుడు నీరు నిలిచిపోయి విద్యార్థులకు తీవ్ర అసౌకర్యంగా మారుతుందన్నారు. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో ఈగలు, దోమలు, పందులకు ఆవాసాలుగా మారి విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో విద్యార్థులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయకపోవడంతో పశువులు, పందులు, కుక్కలు వంటి జంతువుల బెడదతో పాటు రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో కళాశాలలో నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కళాశాలకు రక్షణగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని, కళాశాల ఆవరణంలో గుంతలు లేకుండా పూడ్చివేసి కాంక్రీట్ ఫ్లోరింగ్ నిర్మాణం చేయాలని, మెయిన్ రోడ్డు నుండి కళాశాలకు వెళ్లేందుకు బీటీ రహదారి నిర్మాణం చేపట్టాలని, కళాశాల ఆవరణంలో ఆహ్లాదకర వాతావరణాన్ని తలపించేలా మొక్కలు నాటాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థులను సమీకరించి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ ముక్తవరపు రత్నకిషోర్, నవీన్, ఉదయ్ కిరణ్, మౌనిక, స్రవంతి, సీతమ్మ, నవ్య తదితరులు పాల్గొన్నారు.