Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ చాంబర్ లో అధికారులు, రేషన్ డీలర్లకు అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ నిర్వహించారు. నిత్యావసర వస్తువైన రేషన్ బియ్యం పకడ్బందీ పంపిణీపై తగు సలహాలు, సూచనలు చేశారు. బాలింతలకు పోషకాహారము, కె.సి.ఆర్ కిట్, పొర్టిఫైడ్ బియ్యం రేషన్ కార్డులపై వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. చౌక ధరల దుకాణాలు సమయపాలన పాటించాలన్నారు. రేషన్ బియ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ, కోవిడ్ సందర్భంగా ఇస్తున్న ఉచిత బియ్యం, సంక్షేమ హాస్టల్స్, మిడే మిల్స్ కు సరఫరా చేస్తున్న సన్న బియ్యం పైన సమీక్షించారు. అధికారులు, రేషన్ డీలర్లు ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా జాప్యం లేకుండా అందించాలన్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర సరఫరాల అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. అవగాహన సదస్సులో ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, వైద్య ఆరోగ్య శాఖా ప్రోగ్రాం అధికారి డా.సైదులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, చౌకధరల దుకాణాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
సురక్షిత దీపావళికి చర్యలు : అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్
ఈ నెల 24న సురక్షితంగా దీపావళి జరుపుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ సూచించారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి గురువారం దీపావళి పండుగ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. టపాసుల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రాకర్ షాపులకు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. పవర్ లైన్ లు, హై ఎక్సటెన్షన్ వైర్ ల క్రింద క్రాకర్ షాపులు, షెడ్లు ఏర్పాటు చేయొద్దన్నారు. ప్రతి షాపు ఓనర్ ప్రత్యేక ఎంసీబీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ వైర్లు జాయింట్ లేకుండా చూడాలన్నారు. సైలెంట్ జోన్లలో 100 మీటర్ల చుట్టూ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టు, ప్రార్థనా ప్రదేశాల్లో క్రాకర్ లకు అనుమతి లేదన్నారు. మునిసిపాలిటీ ద్వారా పారిశుద్ధ్యానికి చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రాకర్ స్టాళ్ల వద్ద అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వుంటూ, అంబులెన్స్, 108 వాహనాలు, వైద్య సిబ్బంది, అత్యవసర మందులతో టపాసుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని, పిల్లలు జాగ్రత్తగా ఉండేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, అదనపు డీసీపీ ఎస్.సి. బోస్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఏసీపీ రమేష్, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.