Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో తొలిసారి కిష్టారం ఓసీలో
- రాక్బ్రేకింగ్ టెక్నాలజీని తీసుకొస్తున్నాం
- దెబ్బతిన్న ఇండ్లకు పరిహారాలుండవ్, మరమ్మతులే
- సామాజిక సేవలను మరింతగా విస్తరిస్తాం
- సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం జక్కం రమేశ్
నవతెలంగాణ-సత్తుపల్లి
డ్రిల్ చేసి బ్లాస్టింగ్లు చేసే పాతపధ్దతుల స్థానంలో ఇకపై నూతనంగా రాక్బ్రేకింగ్ టెక్నాలజీతో బొగ్గును వెలికితీస్తామని సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. సోమవారం కిష్టారం ఓసీలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై రమేశ్ మాట్లాడారు. బ్లాస్టింగ్ విభాగానికి నూతన కాంట్రాక్టర్ నియమితులయ్యారని, వారు బ్లాస్టింగ్ బదులు రాక్బ్రేకింగ్ టెక్నాలజీ వాడతారన్నారు. ఎప్పటికప్పుడు సంస్థ అధునాతన సాంకేతికతను అలవరుచుకుంటోందన్నారు. అందులో భాగంగా ఈ బ్రేకింగ్ సిస్టంను తీసుకువస్తు న్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రధమంగా ఈ టెక్నాలజీని స్థానిక కిష్టారం ఓసీలో ప్రయోగించనున్నట్లు రమేశ్ తెలిపారు. దీని ద్వారా బ్లాసింగ్ వల్ల ఏర్పడుతున్న సమస్యలను కొంతమేర అరికట్టవచ్చన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇండ్లకు కంపెనీ నియమాల ప్రకారం నష్టపరిహారం చెల్లించడం కుదరదని, మరమ్మతులు మాత్రం తప్పనిసరిగా చేస్తామన్నారు. రాజకీయం కోసమే కొందరు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారన్నారు. సింగరేణి సంస్థ సామాజిక సేవలకు పెట్టింది పేరని, సంస్థ సేవలను రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తామన్నారు. అనంతరం మాజీ ఉద్యోగులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్షన్ విభాగం టీం లీడ్ ఎల్వీ సూర్యనారాయణ, సభ్యులు డి.లలిత్‌కుమార్, బి.శంకర్రావు, జె.చంద్రశేఖర్, జి.డేవిడ్, పి.భాస్కరరావు, జి.రాజునాయక్, ధనుంజయరెడ్డి, కిష్టారం ఓసీ పీవో కె.నరసింహారావు, పీఈ రమణారావు, సేఫ్టీ ఆఫీసర్ గోపికిశోర్, పిట్ సెక్రెటరీ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.