Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిమెట్టు పై అశ్రద్ధ చూపితే కఠిన చర్యలు
- తొమ్మిది మంది ఉపాధ్యాయులకు షోకాజ్లు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రాధమిక విద్యలో విద్యార్ధులు ధారాలంగా చదవడం, రాయడం, మూల్యాంకనం చేయడం కోసం అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం పై ఎవరు అశ్రద్ధ వహించినా సహించేది లేదని, మండల స్థాయి పర్యవేక్షణ బృందం పరిశీలనలో అటువంటి వారు ఎవరైనా చిక్కితే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని విద్యాశాఖ జిల్లా అధికారి సోమశేఖర శర్మ ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఆయన మంగళవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన అనంతరం మండల విద్యావనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జమ్మిగూడెం, ఊట్లపల్లి, అశ్వారావుపేట, చిన్నంశెట్టి బజారు, పేట మాలపల్లి పాఠశాలల్లో విద్యార్ధుల్లో అభ్యసనా పాఠవాన్ని, ఉపాధ్యాయుల్లో బోధనా పటిమను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జమ్మిగూడెం, ఊట్లపల్లి, పేటమాలపల్లి విద్యార్ధుల్లో కనీస సామర్ధ్యాలు లేకపోవడం గమనించామన్నారు.
వెంటనే ఈ మూడు పాఠశాలల్లోని తొమ్మిది మంది ఉపాధ్యాయులకు వేతనం ఎందుకు నిలుపుదల చేయకూడదో కారణం తెలపాలని షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అశ్వారావుపేట, చిన్నంశెట్టి బజారు ప్రాధమిక పాఠశాలలు విధ్యార్ధుల సామర్ధ్యాలు మెరుగుగా ఉండటంతో ఉపాధ్యాయులను అభినందించారు. తొలిమెట్టు పై జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ఆయన ఆదేశాలు మేరకు పాఠశాలలు ఆకస్మిక పర్యవేక్షణలు తలపెట్టినట్లు తెలిపారు. ఇకనుండి ఒక్కో మండలంలో నెలకు రెండు సార్లు పర్యటిస్తామని తెలిపారు. ''మన ఊరి మన మడి'' పురోగతిలో ఉన్నాయని, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈయన వెంట ఎంఈఓ క్రిష్ణయ్య, అశ్వారావుపేట, అచ్యుతాపురం జిల్లాపరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, పుల్లయ్య, సీఆర్పీ ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.