Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్మపేట, సుజాతనగర్ మండలాల్లో తగ్గుతున్న భూ గర్భ జలం
- పెంచాల్సిన బాధ్యత మనందరిది
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
జలమే జీవనమని, ప్రతి నీటి బింధువును సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం డిఆర్డిఓ సమావేశపు హాలులో కేంద్రీయ భూ గర్భ జలబోర్డు ఆద్వర్యంలో భూ గర్భ జలాల వృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, ఇరిగేషన్, మిషన్ బగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ దమ్మపేట, సుజాతనగర్ మండలాల్లో భూ గర్భ జల మట్టం క్రమంగా తుగ్గుతున్నదని, ఈ ప్రాంతాల్లో భూ గర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. విపరీతంగా పరిమితికి మించి పంటలకు నీటిని తోడేయడం వల్ల పంటల్లో దిగుబడి తగ్గుతుందన్నారు. కావాల్సినంత మేరు మాత్రమే నీరు అందించడం వల్ల పంటలకు ఎంతో మేలు అన్నారు. గాలి తరువాత అత్యంత ముఖ్యమైన వనరు నీరేనని నీరు లేకపోతే ప్రాణుల మనుగణ సాగించలేవని చెప్పారు. జిల్లాలో గత సంవత్సరం నుండి చేపట్టిన నీటి సంరక్షణ చర్యల వల్ల ఒక మీటరు భూ గర్భ జలాలు పెంపొందాయని చెప్పారు. జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు నిరంతర ప్రక్రియగా జరగాలని చెప్పారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా చేసేందుకు భూ గర్భ జలాలను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనున్నదని చెప్పారు. నీటి సంరక్షణకు ఉపయోగపడే చెరువులు, పంట కాలువలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు.
భూ గర్భ జలాలు పెంపొందించు చర్యల్లో భాగంగా అక్రమనీటి వాడకాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భూ గర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, కందకాలు, కాంటూర్లు, ఊటకుంటలు, చెక్ డ్యాంలు, బావుల రీ చార్జ్, పారుతున్న నీటిని భూగర్భ జల ఆనకట్టలు ద్వారా నిలిపివేయడం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ భూ గర్భ జలబోర్డు ప్రాంతీయ సంచాలకులు సిద్ధార్ధ్ కుమార్, సైంటిస్టులు రాణి, రేష్మా పిళై, రాఘవేందర్, డిఆర్డిఏ పీడి మధుసూదన్ రాజు, భూగర్భ జల అధికారి బాలు, సింగరేణి డిప్యూటి జియం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.