Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మన్ పదవి కోసం పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
నవతెలంగాణ - బోనకల్
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ప్రధానంగా కలకోట గ్రామానికి చెందిన ఇటికాల శ్రీనివాసరావు పోటీపడుతున్నారు. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు పదవీకాలం ఈనెల 19వ తేదీతో ముగియనున్నది. చైర్మన్ పదవిని బీసీకి కేటాయించారు. బోనకల్ మండల పరిధిలోని టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ముష్టికుంట గ్రామానికి చెందిన బంధం శ్రీనివాసరావును జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బంధం శ్రీనివాసరావు పేరుని దాదాపుగా ఖరారు చేసినట్లు నవతెలంగాణ దినపత్రికలో ఈనెల 17న మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బంధం శ్రీనివాసరావు ని ఖరారు చేసినట్లు కథనం వచ్చింది. దీంతో ఒక్కసారిగా బోనకల్ మండలానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉలిక్కిపడ్డారు. దీంతో బోనకల్ మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులలో తీవ్రంగా చర్చ సాగుతుంది. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ప్రధానంగా కలకోట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త సీనియర్ నాయకుడు ఇటికాల శ్రీనివాసరావు ఉన్నాడు. ఇందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా బోనకల్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ యువకుడు, విద్యావంతుడు యార్లగడ్డ రాఘవరావు కూడా పోటీలో ఉన్నట్లు బోనకల్ గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతుంది. మండలంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన మరికొందరు కూడా పోటీపడుతున్నట్లు తెలిసింది. చొప్పకట్లపాలెం, గోవిందాపురం ఎల్, బ్రాహ్మణపల్లి, ముష్టికుంట్ల, పెద్ద బీరవల్లి గ్రామాలకు చెందిన మరికొందరు కూడా పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా బంధం శ్రీనివాసరావు మూడుసార్లు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా పని చేశాడని, పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అనేకమంది పార్టీ కోసం పనిచేస్తున్నారని, వారికి అవకాశం కల్పించాలని మరికొందరు యువ నాయకులు అధినాయకత్వాన్ని కోరుతున్నారు. బంధం శ్రీనివాసరావు సామాజిక వర్గానికి చెందిన వారే ఆయన నియామకం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని టిఆర్ఎస్ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అప్పుడే వేడి ప్రారంభమైంది. మరికొందరు సీనియర్ నాయకులు అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మాత్రమే చైర్మన్‌ని ఎంపిక చేయాలని అలా కాకుండా ఏకపక్షంగా బంధం శ్రీనివాసరావుని నియమిస్తే అంగీకరించేది లేదని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా అధిష్టానానికి అప్పుడే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అధినాయకత్వం చైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేయలేదని వారిని వారించినట్లు తెలిసింది. ప్రస్తుతం మండలంలో ముఠాపోరు లేదని, ఏకాభిప్రాయానికి భిన్నంగా అధినాయకత్వం వ్యవహరిస్తే ముఠా పోరు మళ్లీ ప్రారంభం అవుతుందని ఈ ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికలలో తప్పకుండా పడుతుందని దీనివలన పార్టీ అభ్యర్థికి నష్టం జరుగుతుందని మరికొందరు నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చైర్మన్ రేసులో ముందు ముందు ఆశావహుల సంఖ్య మరింత పెరగవచ్చునని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. బంధం శ్రీనివాసరావు ఎంపికను ఆయన సామాజిక వర్గానికి చెందిన బలమైన సామాజిక వర్గమే తీవ్రంగా వ్యతిరేకిస్తుందని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సామాజిక వర్గమే కాక ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. చివరకు టిఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే చైర్మన్‌ను ఎంపిక చేస్తారా లేక అందుకు భిన్నంగా అధినాయకత్వమే ఎంపిక చేస్తుందా లేక రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడం కంటే ఉన్న చైర్మన్ పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగిస్తారా వేచి చూడవలసిందే.