Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోతుల బెడద నుంచి పత్తి, పొలాలను ప్రభుత్వం రక్షించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
మండల పరిధిలోని మేడేపల్లి, కాలనీ నాచారం ప్రాంతాల్లో జరుగుతున్న పోడు భూముల సర్వేను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏర్పుల రాములు, ఇటికిల లెనిన్, కాలసాని సాయికుమార్లతో కలిసి మంగళవారం పర్యటించారు. సాగుచేస్తున్న పోడు భూములను పరిశీలించి గిరిజన రైతులు అధికారులతో మాట్లాడి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ పోరాటాల ఫలితంగానే పోడు భూములు సర్వే జరుగుతుందని, హక్కుపత్రాలు వచ్చేంతవరకు ఐక్యంగా కలిసికట్టుగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన ముఖ్యమైన సమస్య కోతుల సమస్యను వివరించారు. పత్తి పంట మరియు పొట్ట కొచ్చిన వరి పంటను వందల సంఖ్యలో కోతులు ఆగమాగం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం శాస్త్రీయంగా ఆలోచించి కోతుల బెడద సమస్యను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కోతుల సమస్యకు పరిష్కారం చూపకపోతే వ్యవసాయం చేయటం సాధ్యం కాదని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు భూక్యా వీరభద్రం తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వ ఆదేశాలతో సాగులో ఉన్న పోడు భూముల్లో మొక్కలు నాటారని, ఆ భూములను గిరిజనులకు కేటాయించి సర్వే చేసే హక్కుపత్రాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎఫ్ఆర్సి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పునెం కృష్ణ, బండ్ల చిన్న జోగయ్య, నాచారం సర్పంచ్ వర్షా రాంబాబు, దారవత్ జమ్లీ. తాటి యుగేందర్, సున్నం నరసింహ, ముక్తి వెంకటేశ్వర్లు, బండ్ల వెంకటి తదితరులు పాల్గొన్నారు.