Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పామాయిల్‌తో సంబంధంలేని ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులు వ్యయం
- అక్టోబర్ 1వ తేదీన దిగుమతి అయిన పామాయిల్ గెలలకు గత నెల ధర చెల్లించాలి
- తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పామ్ గ్రోవర్స్ సొసైటీ డిమాండ్
నవతెలంగాణ-దమ్మపేట
పామాయిల్ రైతుల ఎఫ్-కోడ్ వివరాలను బహిర్గత పరచాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పామ్ గ్రోవర్స్ సొసైటీ డిమాండ్ చేసింది. దమ్మపేటలోని రైతు వేదికలో గురువారం సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్యదర్శి తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్యలు మాట్లాడారు. సొసైటీ సభ్యుడు చెలికాని సూర్యరావు టీఎస్ ఆయిల్‌ఫెడ్‌ను సమాచార హక్కు చట్టం ద్వారా రైతుల ఎఫ్-కోడ్ల వివరాలు అడగగా రైతుల వివరాల సమాచారం ఇవ్వడం అసాధ్యమని జవాబిచ్చారని అన్నారు. టీఎస్ ఆయిల్‌ఫెడ్‌లో ఎర్రుపాలెం కలక్షన్ సెంటర్ నుంచి నందిగామ రజిత అను మహిళ పేరుతో సుమారు 32 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ గెలలు కొనుగోలు చేసారన్నారు. ఎర్రుపాలెం మండలంలో సుమారు 39 ఎకరాలు మాత్రమే పామాయిల్ తోటలు విస్తరించి వున్నాయన్నారు. ఇటువంటి కుంభకోణాలు ఎన్ని జరిగాయో తెలుసుకుని నివారించేందుకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం ఎఫ్-కోడ్ల వివరాలు గోప్యంగా వుంచడంలో మర్మమేంటని ప్రశ్నించారు. పామాయిల్ ఫ్యాక్టరీలు వున్న అప్పారావుపేట, అశ్వారావుపేటల్లో కాకుండా వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కార్పరేటు సోసియల్ రెస్పాన్సబులిటి (సీఎస్ఆర్) నిధులు రూ.కోటి వ్యచ్చించినట్లు ఆయిల్‌ఫెడ్ సమాచారమిచ్చిందన్నారు. ఫ్యాక్టరీ కాలుష్య ప్రభావం వున్న ప్రదేశాన్ని వదిలేసి చైర్మన్, వ్యవసాయ శాఖ మంత్రిలకు చెందిన ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులు వెచ్చించడం సరైంది కాదన్నారు. ఫ్యాక్టరీలకు గెలలను తోలుకెళ్లిన ట్రాక్టర్ల డ్రైవర్లు, రైతులు వేచివుండటానికి వసతి కరువైందన్నారు. ఆయిల్‌ఫెడ్ ఉన్నత స్థాయి వ్యక్తులు వచ్చినప్పడు వుండటానికి మాత్రం కోట్ల రూపాయిలు వెచ్చించి గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈనెలాఖరుకు ఆయిల్ ఇయర్ ముగయనుందని, నవంబరులో జరిగే పామాయిల్ గెలల ధర నిర్మాయానికి ఫార్ముల ఫిక్సేషన్ అశ్వారావుపేట జోన్లోనే రైతుల సమక్షంలో నిర్వహించాలన్నారు. అక్టోబర్ 1వ తేదీన దిగుమతి అయిన పామాయిల్ గెలలకు సైతం సెప్టెంబర్ నెల ధరనే చెల్లించాలని అన్నారు. సమావేశంలో దారా తాతారావు, దమ్మపేట సొసైటీ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, పోతినేని శ్రీరామవెంకటరావు, కేదాసి వెంకట సత్యనారాయణ, పోతినేని శ్రీరామవెంకటరావు, మన్నెం అప్పారావు, ముష్టిబండ సర్పంచ్ బత్తిని తిరుపతిరావు, కంబంపాటి పుల్లారావులు పాల్గొన్నారు.