Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధిలో తవ్వేకొద్ది బయటపడుతున్న అక్రమాలు
- డ్వాక్ర సభ్యుల పేర్లపై నిధులు దారి మళ్లింపు
- ప్రజావేదికను బహిష్కరించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-ములకలపల్లి
2019-2022 సంవత్సరానికి గాను మండలంలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద జరిగిన రూ.22.40 కోట్ల పనులకు సోషల్ ఆడిట్ టీం సేకరించిన నివేదికలను మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. స్థానిక ఎంపీపీ మట్ల నాగమణి అధ్యక్షతన ప్రారంభమైన ప్రజావేదిక వద్ద సోషల్ ఆడిట్ సక్రమంగా జరగలేదని, జరిగిన పనుల్లో అక్రమాలు భారీగా చోటుచేసుకున్నాయని, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో తిరిగి సోషల్ ఆడిట్ నిర్వహించిన తర్వాతనే ప్రజావేదిక కొనసాగించాలని కోరుతూ ఎంపీపీ మట్ల నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ప్రజావేదికను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటలకు డీఆర్డీవో ఏపీడీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో కేవలం ప్రభుత్వ అధికారులతో ప్రజావేదిక తిరిగి ప్రారంభమైంది. రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన ప్రజావేదికలో కేవలం రెండు గ్రామపంచాయతీలకు సంబంధించిన ఆడిట్ మాత్రమే జరిగింది. దీంట్లో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ సోషల్ ఆడిట్ బృందం ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చారు. జగన్నాథపురం పంచాయతీలో ఇంకుడుగుంతలు నిర్మించకుండానే నిర్మించినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు కాజేశారని, మైనర్లు, మృతి చెందిన, డ్వాక్రా సభ్యుల పేర్ల మీద మస్టర్లు వేసి నిధులు దారి మళ్లించారని, ఒక్కో చోట రైతుల పొలాల్లో మొక్కలు నాటకుండానే నాటినట్లు చూపించి నిధులు స్వాహా చేసినట్లు ఆడిట్ బృందం ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చింది. అంతేకాకుండా చిన్న చిన్న గుంతలు తవ్వి పెద్ద పెద్ద చెరువులు తవ్వినట్లుగా చూపించి లక్షల్లో నిధులు గోల్మాల్ చేసినట్లు ప్రజావేదిక సాక్షిగా అక్రమాలు బయటపడ్డాయి.
కొందరు మైనర్లు మేట్లుగా వ్యవహరించడం వంటివి కూడా ప్రజావేదిక దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఈ రెండు పంచాయతీల్లోనే లక్షల్లో రికవరీలు జరిగే అవకాశం ఉండగా ఇంకా మిగిలిన 18 పంచాయతీల్లో ఆడిట్ ప్రవేశపెడితే ఇంకెన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడతాయోనని పలువురు విస్మయానికి గురవుతున్నారు. ప్రజావేదిక అర్ధరాత్రి వరకూ సాగే అవకాశం ఉందని ఎంపీడీవో నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రజావేదికలో సోషల్ ఆడిట్ ఏబీఎం అనూష, ఏఈవో శ్రీరమణ, అంబుడ్స్మెన్ నాగప్రకాష్, ఏపీవో విజయలక్ష్మి, ఎస్ఆర్పీలు రమేష్, రాంబాబు, ఇతర సోషల్ ఆడిట్ సభ్యులు పాల్గొన్నారు.