Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ హైవేకు తోలాల్సిన మట్టి పక్కదారి
- ప్రయివేట్ వెంచర్లకు తోలుతున్న టిప్పర్లు
నవతెలంగాణ-ఖమ్మం (ఖమ్మం రూరల్)
మండలంలో మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. పర్మిషన్ తీసుకునేది ఒక చోట. మట్టిని తరలించేది మరోచోట. పొన్నేకల్లు సూర్యాపేట నేషనల్ హైవేకు మట్టి తోలేందుకు మైనింగ్, రూట్ పర్మిట్ తీసుకుని ఏదులాపురం, గుర్రాలపాడు, పెద్దతండాలో వెంచర్లకు తరలిస్తున్నారు. డీఆర్ఎన్ కన్సట్రక్షన్ కంపెనీకి మట్టి తోలేందుకు మండలంలోని పెద్ద తండాకు చెందిన ఓ మట్టి వ్యాపారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మండలంలోని తనగంపాడు రెవెన్యూ పరిధిలోని తనకున్న 4.53 హెక్టార్ల గుట్టలో మట్టి తోలకాలు జరుపుకునేందుకు మైనింగ్, రెవెన్యూ నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. తన భూమి బాగు చేసుకుంటూనే డీఆర్ఎన్ కంపెనీకి మట్టి అమ్ముకునేందు ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా అన్ని అనుమతులు తీసుకున్నాడు. కాని ఇక్కడే పప్పులో కాలేశాడు. పది ట్రిప్పులు సూర్యాపేట జిల్లాలో మోతె ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులకు తోలుతూనే మరో అయిదు ట్రిప్పులు ఏదులాపురం, పెద్దతండా, గుర్రాలపాడు వెంచర్లను అధిర ధరలకు అమ్ముకుంటున్నాడు. డీఆర్ఎన్ కంపెనీని మోసం చేయడమే కాకుండా అధికారుల కళ్లుగప్పి రోజులో సగం ట్రిప్పులు దారి మళ్లిస్తున్నాడు. ఒక వైపు అధికారుల, గ్రామస్తులు, సర్పంచ్లు అందరిని మేనేజ్ చేసుకుంటున్నాడు. ఎలాంటి అడ్డు అదుపూ లేకుండా మట్ట దందా కొనసాగుతుంది. ఒక్కో టిప్పర్ రూ.2500లకు విక్రయిస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.