Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు బంద్
- 3 నెలలుగా మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు బంద్
- ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు
నవతెలంగాణ - బోనకల్
మూడు నెలలుగా గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయటం లేదు. మరోవైపు గత ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల నిలిపివేయటంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసే ఎఫ్‌ఎఫ్‌సి నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి నిధులు జమ చేసేది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల గురించి ప్రజలకు తెలియడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే అంతా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుందన్న సమాచారం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీనికి తోడు తాము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమితో వేరే పనులకు వినియోగించుకుంటూ ఇష్టాసారంగా ఫ్రీజింగ్ పేరుతో నెలల తరబడి బిల్లులను నిలుపుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆలస్యంగా ట్రెజరీలకు జమ చేసే అంశాలను గుర్తించినట్లు సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీలకు కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపులపై వివాదాల తలెత్తడంతోపాటు స్పష్టత కొరవడింది. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పంచాయతీలకు నిధుల విడుదలను కేంద్రం ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా తామే స్వయంగా పంచాయతీలకు ఎఫ్‌ఎఫ్‌సి నిధులు జమ చేస్తామని అందుకు గాను ప్రతి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాతో సంబంధం లేకుండా ఖాతాను వేరుగా తెరవాలని సూచించింది. దీంతో ప్రతి గ్రామపంచాయతీ కేంద్రం ఇచ్చే నిధుల కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచింది. గతంలో పంచాయతీలో జనాభాను బట్టి ప్రతి వ్యక్తికి 120 పైసలు చొప్పున జమ చేసేవారు. క్రమేనా తగ్గించి దాదాపు రూ 115 చొప్పున వేస్తున్నారు. అవి కూడా నేటి వరకు జమ చేయలేదని సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా జులై నుంచి నిధులను జమ చేయకపోవడంతో సర్పంచులు లబోదిబోమంటున్నారు. గ్రామపంచాయతీలకు మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఇది ఇలా ఉండగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేసిన పనులకు సంబంధించి చెక్కులు ట్రెజరీలకు పంపించి నెలల గడుస్తున్న ఖాతాలలో నేటి వరకు డబ్బులు జమ చేయలేదు. దీంతో కొత్త పనులు చేయలేక పోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు కూడా బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని సర్పంచులు వాపోతున్నారు. ఒక్కొక్క పంచాయతీ ఐదు నుంచి 15 లక్షల వరకు చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉంది. మండల అధికారులు పనులు చేయాల్సిందేనని వెంట పడటంతో సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నారు. కానీ అవి సకాలంలో రాకపోవడంతో వడ్డీలకు వడ్డీలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని సందర్భాలలో గ్రామపంచాయతీలలో నిధులు ఉన్న ట్రెజరీరాల్లో ఫ్రీజింగ్ పెట్టడం వలన తాము ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. కుండలో బువ్వ కుండలో ఉండాలి బుడ్డోడు మాత్రం దుండుగా ఉండాలనే చందాన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని సర్పంచులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేయాల్సిన పనులకు చేతిలో చిల్లి గవ్వలేక నిరాశ నిస్పహలతో సర్పంచులు కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వ్యవహార శైలి ఎలా ఉండగా గ్రామాలలో ఇంటి పనులు పూర్తిస్థాయిలో వసూలయ్యే పరిస్థితి లేదు. దీంతో జనరల్ ఫండ్ లేక కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు జమ కాక సర్పంచుల పరిస్థితి పొగ చెక్కలో ఆడకత్తెరలా తయారైంది. ఎఫ్‌ఎఫ్‌సి, ఎస్ఎఫ్సి నిధులతో గ్రామాల్లో అభివద్ధి పనులు పారిశుధ్య పనులు, పైపులైన్ల లీకేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు తదితర పనులు చేస్తున్నారు. సర్పంచుల పరిస్థితి ఎలా ఉండగా గ్రామపంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల పరిస్థితి ధైర్యంగా తయారయింది. మూడు నెలలుగా మల్టీపర్పస్ వర్కర్లకు సంబంధించి జీతాల చెక్కులను ట్రెజరీలలోనే ములుగుతున్నాయి. తమ కుటుంబ పోషణ భారంగా మారిందని మల్టీపర్పస్ వర్కర్లు వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి పనులు చేస్తున్నాం- నోముల వెంకట నరసమ్మ,, సర్పంచ్ తూటికుంట్ల
అప్పులు చేసి అభివద్ధి పనులు చేస్తున్నాం. నెలల తరబడి పంచాయతీలకు నిధులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాను. అధికారులు పనులు చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నాం. మూడు నెలల నుంచి చేసిన పనులకు ఎనిమిది లక్షల రూపాయలు రావాల్సి ఉంది. కనీసం పాశుద్ధ్య పనులు, ట్రాక్టర్ డిజిల్, విద్యుత్ బిల్లులు లాంటి పనులు నిర్వహణ కష్టతరంగా మారింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల చేయాలి : ములకారపు రవి,
సర్పంచ్ చిరునోముల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చివరకు మల్టీపర్పస్ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి గ్రామపంచాయతీలు చేరుకున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. చేసిన పనులకు తనకు 13 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అప్పు చేసి తెచ్చిన పెట్టుబడులకు ప్రతినెల వడ్డీ చెల్లిస్తున్నాం. అప్పులు చేసి పనులు చేసే పరిస్థితి ఏర్పడింది.
మల్టీపర్పస్ వర్కర్ల జీవితాలు దుర్భరం: భాగం శ్రీనివాసరావు, సర్పంచ్ గోవిందాపురం(ఏ)
మూడు నెలలగా మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు చెల్లించకపోవడం వలన వారి జీవితాలు దుర్భరంగా మారాయి. తనకు చేసిన పనికి గాను 3 లక్షల రూపాయలు బిల్లు రావాల్సి ఉంది. సర్పంచుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అప్పులు చేసి అభివృద్ధి పనులు ఎంతకాలం చేయాలి. ప్రభుత్వం సర్పంచులను బిచ్చగాళ్లుగా మారుస్తుంది.