Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-తల్లాడ
మతతత్వ బిజెపిని ఎదుర్కొనేందుకు వామపక్ష పార్టీలకు తోడుగా మేధావులు, అభ్యుద యవాదులు, రైతులు, కూలీలు, పేద ప్రజలు, కార్మికులు కలిసి రావాలని సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. తల్లాడ మండలం కలకడ గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదూరి వెంకటరత్నం సంస్మరణ సభ ఆదూరు జీవరత్నం అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సభలో పోతినేని మాట్లాడుతూ వెంకటరత్నం సమసమాజ నిర్మాణం కోసం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భూమి కోసం ఇళ్ల స్థలాల కోసం తన పోరాడిన వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయడం ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. మతతత్వ బిజెపి పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఇళ్లను కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేటర్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, వీటన్నింటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ పుట్టిన మహారాష్ట్రలో నేడు ఎర్రజెండా వైపు ప్రజలు చూస్తున్నారని, అక్కడ ఇటీవల వచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్తు కాలం ఎర్రజెండాలదేనని అన్నారు. సిపిఎం పరిపాలనలో ఉన్న కేరళ అన్ని రంగాల్లో ముందు ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర రావు, పార్టీ సీనియర్ నాయకులు తాత భాస్కరరావు మాట్లాడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాల కోసం వెంకటరత్నం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, నల్లమోతు మోహన్ రావు, గుంటుపల్లి వెంకటయ్య, సూరంపల్లి గోపాలరావు, దొబ్బల సురేష్, పులి కృష్ణయ్య, కళ్యాణ కృష్ణయ్య, షేక్ మస్తాన్, షేక్ నన్నేసాహెబ్, సత్తెనపల్లి నరేష్, నాయుడు అప్పారావు, దూల జనార్ధన్ పాల్గొన్నారు.