Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారు
- విద్యార్థులతో తల్లిదండ్రుల నిరసన
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా వున్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను (సర్ప్లస్) పంపడం జరిగింది. డిప్యూటేషన్ పంపే విషయంలో తొలి ప్రాధాన్యత స్థానిక మండలంలోని పాఠశాలలకు ఇవ్వడం, ఆ తర్వాత పక్క మండలంలోని పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. ఆ నిబంధనకు విరుద్ధంగా గురువారం విద్యాశాఖ అధికారులు ఆళ్ళపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్ చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా మండల పరిధిలోని రాఘవాపురం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల నుండి ఒక మహిళా టీచర్‌ను ఇల్లందు మండలంలో ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్‌లో పంపించారు. కానీ, సదరు రాఘవాపురం పాఠశాలలో 37 మంది విద్యార్థులు, ఒక్క టీచరే ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఇద్దరు టీచర్లు ఉండాలి. దీని ప్రకారం పాఠశాలలో ఇద్దరు టీచర్లు, 37 మంది విద్యార్థులు ఉండేది. అంతా సవ్యంగానే ఉన్నదని అనుకునే లోపే నిబంధనకు తూట్లు పొడుస్తూ.. స్థానిక కలెక్టర్‌కు పాఠశాల విద్యార్థుల సంఖ్య విషయంలో 15 మందే విద్యార్థులు ఉన్నారనే తప్పడు నివేదికను ఇచ్చి అక్రమ డిప్యూటేషన్ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో 37 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు విద్య విషయంలో సరైన న్యాయం జరగదని ఎస్ఎంసీ చైర్మెన్, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు చెపుతున్నారు. అసలే మారుమూల ఏజెన్సీ మండలంలో కొన్ని పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధన ప్రకారం పాఠశాల నుంచి టీచర్‌ను పంపే ఆస్కారం లేనిచోట సొంత మండలం కాకుండా పక్క మండలానికి టీచర్‌ను పంపించటం దారుణమని వారు వాపోతున్నారు. అలా కాకుండా మండలంలో వలసల గ్రామం పాఠశాలలో అసలు ఉపాధయ్యులే లేరు. ఆ పాఠశాలకు పంపినా అర్థముందని పలువురు స్థానికులు వేలెత్తిచూపుతున్నారు. మరి కొన్ని పాఠశాలలో ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయి. ఉన్న ఆ ఒక్క టీచర్ సెలవు పెడితే ఆ రోజు ఆ స్కూల్ మూతపడటం జరుగుతుంది. ఇలాంటి దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాల సాగుతుంటే కొందరు టీచర్ల, అధికారుల అనాలోచిత నిర్ణయాలవలన మండలంలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్ష మారుతుంది. ఆళ్లపల్లి కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలో అస్సలు ఉపాధ్యాయులు లేని వలసల పాఠశాలను వదిలేసి వేరే మండలానికి ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌లో వెళుతుంటే కాంప్లెక్స్ హెచ్.ఎం బి.వీరన్న, స్థానిక విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య ఏం చేస్తున్నారని రాఘవాపురం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు, మా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్ అక్రమ డిప్యూటేషన్ వెంటనే నిలిపివేయాలని గురువారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి చొరవ తీసుకుని మా పాఠశాలకు న్యాయం చేయాలని కోరారు.