Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 421 మందికి దళితబంధు పథకాన్ని మంజూరు చేశాం
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
దళితబంధు నిధులనే పెట్టుబడిగా పెట్టి అదనపు ఆదాయం సంపాదించి దళితులు అభివృద్ధి సాధించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో దళితబంధు, మన ఊరు-మనబడి కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, విద్యా, ఇంజనీరింగ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 421 మందికి దళితబంధు పథకాన్ని మంజూరు చేశామని, మంజూరైన అన్ని యూనిట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. దళితబంధు నిధులను పెట్టుబడిగా పెట్టి అదనపు ఆదాయం సముపార్జించి వ్యాపారా వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టిందని, పథకం వినియోగంతో అభివృద్ధిని సాధించాలని కోరారు. యూనిట్లు ఏర్పాటు ద్వారా లబ్దిదారులు సముపార్జించిన ఆదాయ, వ్యయాలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. కొంతమంది లబ్దిదారులు యూనిట్లు నిర్వహణ బాగా చేస్తూ ఆదాయం గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, అటువంటి వారిని ఆదర్శంగా, స్పూర్తిగా తీసుకుని మిగిలిన లబ్దిదారులు యూనిట్లు మంచిగా నిర్వహించి ఆదాయం సంపాదించుకోవాలని చెప్పారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో మరమ్మతులు పూర్తయిన పాఠశాలలకు రంగులు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతలో 368 పాఠశాలలు ఎంపిక కాగా రూ.30 లక్షల కంటే తక్కువ వ్యయమయ్యే పాఠశాలలు 324 ఉన్నాయని, రూ.30 లక్షలు పైబడి ఖర్చయ్యే పాఠశాలలు 44 ఉన్నాయని చెప్పారు. 324 పాఠశాలల్లో. మరమ్మత్తుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రూ.30 లక్షలు పైబడి మరమ్మతులున్న 44 పాఠశాలల్లో 37 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా 7 పాఠశాలల్లో పనులు నిర్వహణకు టెండర్దశలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 5 పాఠశాలల్లో రంగులు వేయు ప్రక్రియ ప్రారంభం కాగా 47 పాఠశాలల్లో సోమవారం నుండి రంగులు వేయు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, దళితబంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు మధుసూదన్ రాజు, సంజీవరావు, వెంకటేశ్వర్లు, మరియన్న, సీతారాం నాయక్, విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.