Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాల్ రూ.12వేల నుంచి రూ.5వేలకు క్షీణత
- రోజురోజుకూ రేటు తగ్గుతున్నా అడ్రస్ లేని సీసీఐ
- అడ్డంగా దోచేస్తున్న వ్యాపారులు...పట్టని యంత్రాంగం
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఊపందుకున్న పత్తి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
పత్తి ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. మార్కెట్కు పత్తి రాక అధికమవుతున్నా కొద్దీ ధరల్లో క్షీణత కనిపిస్తోంది. రేటు తగ్గితే రంగంలోకి దిగుతామన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆచూకీ లేదు. ఇదే అదనుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ విషయమై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా మార్కెట్ పాలన యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.8,000, కనిష్ట ధర 6,000 పలుకగా నమోనా ధర రూ.7,000గా నిర్ధారించారు. కానీ వివిధ సాకులు చూపుతూ అధిక మొత్తం పత్తిని వ్యాపారులు రూ.5,000లోపే కొనుగోలు చేశారు. గురువారం మార్కెట్కు ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో 11,979 బస్తాల సరుకు అమ్మకానికి వచ్చింది. సరుకు ఎక్కువగా రావడంతో వ్యాపారులు దోపిడీకి తెరదీశారు. పత్తి ఎంత బాగున్నా ధర తక్కువగానే పెట్టారు. చేసేది లేక రైతులు అరకొరగా పండిన పంటనుఅమ్ముకు వెళ్లారు.
పట్టని పాలనాయంత్రాంగం...అడ్రస్ లేని సీసీఐ
జెండా పాటకు మార్కెట్లో అధిక మొత్తం సరుకు ధరలకు ఏమాత్రం పొంతన లేకపోవడంపై రైతులు మార్కెట్ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా...ఫలితం లేకపోయింది. ధర తగ్గినప్పుడు సీసీఐ రంగంలోకి దిగుతుందన్న అధికారులు ఆమేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాది సీసీఐ పత్తి మద్దతు ధర క్వింటాల్ రూ.6,380గా నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.8వేలు పలుకుతున్న నేపథ్యంలో సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు అధిక మొత్తం పత్తిని రూ.5-6 వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, పంట దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో క్వింటాల్ పత్తి రూ.12వేలకు పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు.
సరుకు పెరుగుతున్నా కొద్దీ తగ్గుతున్న ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఇటీవలికాలంలో పత్తి రాక ఊపందుకుంది. క్రమేణా ధరల్లో క్షీణత చోటుచేసు కుంటోంది. కొనుగోళ్లను పరిశీలిస్తే బుధవారంతో పోల్చితే గురువారం నాటికి పాట ప్రకారం గరిష్ట ధరల్లో రూ.153, కనిష్ట ధరలో రూ.200 తగ్గితే వ్యాపారులు మాత్రం రూ.1000 తగ్గించి కొనుగోలు చేశారు. గురువారం మార్కెట్కు 11,979 బస్తాలు రాగా రూ.8వేలు గరిష్ట, రూ.6,000 కనిష్ట ధరగా నిర్ధారించారు. బుధవారం 4,333 బస్తాలు వచ్చాయి. ఈనెల 21వ తేదీ 5,465 బస్తాలు రాగా వరుసగా రూ.8, 7, 6వేల ధరలు నిర్ణయించారు. ఇదే నెల 12న కేవలం 325 సంచులు రాగా గరిష్ట ధర రూ.9,107, సెప్టెంబర్ 21న 43 బస్తాలు రాగా గరిష్ట, నమూనా, కనిష్ట ధరలన్నీ రూ.9వేలకు పైగా నమోదయ్యాయి. ఆ రోజు గరిష్ట ధర రూ.9,500 నమోదైంది. ఇలా సరుకు ఊపందుకున్నా కొద్దీ ధరల్లో క్షీణత చోటుచేసుకోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.12వేలకు పైగా ఉంటేనే కొంతమేర గిట్టుబాటు...
గతేడాది వరంగల్ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి రూ.12వేలకు పైగా ధర రావడం, వివిధ మార్కెట్లలో రూ.10వేలకు పైగా ధర నిలకడగా కొనసాగడంతో రైతులు ఈ ఏడాది పత్తి సాగు వైపు మొగ్గుచూపారు. దిగుబడి తగ్గినా ధరల్లో కలిసి వస్తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ ఈ ఏడాది ధరల్లో భారీగా తగ్గుదల ఉండటంపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో 2020-21లో 60.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2021-22లో 75 లక్షల ఎకరాలు, ఈ ఏడాది 85 లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. గత ఐదారేళ్ల క్రితం వరకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి అయితే ఇప్పుడు ఏకంగా రూ.50,000 పెట్టుబడులవుతున్నాయి. కానీ ఈ నిష్పత్తిలో పంట ధరల్లో పెరుగుదల లేకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. గతంలో ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఇప్పుడు ఐదు క్వింటాళ్ల లోపే వస్తుందని వాపోతున్నారు. ధరల్లోనైనా కలిసి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
దోపిడీ అరికట్టి...పాట ప్రకారం ధరివ్వాలి...
బాణోత్ రమేష్, బండమీది తండా, కూసుమంచి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జెండా పాటకు అనుగుణంగా ధరలు ఇవ్వట్లేదు. ఇష్టమైతేనే అమ్మండి లేకుంటే లేదన్నట్లుగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మిర్చికి పెట్టుబడి కోసమని పత్తిని అమ్ముదామని వచ్చా. రూ.12వేల వరకు అమ్మాల్సిన పత్తిని రూ.5వేలకే అడుగుతున్నారు. వ్యాపారులు, మార్కెట్ పాలనాయంత్రాంగం కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు తగ్గిస్తున్నారు. నేను ఈ ఏడాది 2 ఎకరాల పత్తి వేశా. రూ.80వేలకు పైగా పెట్టుబడి పెట్టా. కానీ నాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. ఇదే రేటు ఉంటే నేను నిలువునా నష్టపోవాల్సిందే.