Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసాయన ఎరువుల వాడకంతో ప్రయోజనం లేదు
నవతెలంగాణ-వైరా
వరి పండించే రైతులు ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులు వాడకం ద్వారా ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గటమే గాని ప్రయోజనం లేదని రైతు సోదరులు తెలుసుకోవాలని వ్యవసాధికారులు తెలిపారు. మండలంలోని దాచాపురం గ్రామానికి చెందిన ముక్కెర చెన్నారెడ్డి వరి పొలంలో గురువారం పిఎస్బి(పాస్పరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా) డెమో నిర్వహించారు. పిఎస్బి వాడకాన్ని ప్రోత్సహించి భూమిలోని వ్యర్థ బాస్వరాన్ని కరిగించి పంటలకు వినియోగం తేవడమే ఈ డెమో లక్ష్యం అని మండల వ్యవసాయాధికారి ఎస్.పవన్ కుమార్ అన్నారు. రైతులు అధిక దిగుబడి సాధించాలన్న తపనతో వ్యవసాయ ఖర్చులను అంచనా వేసుకోకుండా అధిక రసాయన ఎరువులు వాడుతూ భూసారాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. సమతుల్య పోషక యాజమాన్య పద్ధతులు పాటించకుండా ఒకే రకమైన రసాయన ఎరువులు వాడుతున్నారని తెలిపారు. అలా కాకుండా భూమి లోని వ్యర్థ బాస్వరాన్ని పంటలకు అందించే విధానాన్ని రైతులకు డెమో ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జూన్లో నారు పోసుకుని జూలై 15న నాటు వేసిన బిపిటి 5204 సాంబ మసూరి వరి పొలంలో దమ్ములో గాని, మెట్ట దుక్కిలో గాని ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా నేరుగా నాట్లు వేసిన 10వ రోజున ఎకరానికి 1/2 లీటర్ పిఎస్బిని 10 లేక 12 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా కలియ చల్లినట్లు తెలిపారు. అట్టి పొలంలో ఇప్పటి వరకు రసాయన, సేంద్రీయ ఎరువులు వాడ లేదని ఏఓ తెలిపారు. ముక్కెర చెన్నారెడ్డికి చెందిన మరి కొంత భూమిలోని వరిని, పిఎస్బి వాడిన పొలాన్ని నాటు వేసిన ప్రతి మూడు వారాలకు ఒకసారి పరిశీలించామని, పిఎస్బి వాడిన పొలంలో వరిలో అధిక పిలకలు వచ్చి డెమో నిర్వహించిన మాకు, రైతుకూ సంతృప్తినిచ్చిందని వ్యవసాయాధికారులు వివరించారు. ఎరువులు వాడనందున 3500, సస్యరక్షణ మందులు కూడా వాడవలసిన అవసరం రానందున మరో 2500 రూపాయలు ఖర్చు తగ్గిందని అన్నారు. రైతు చెన్నారెడ్డి మాట్లాడుతూ పిఎస్బిని ఎలా వాడాలో ఖానా పురం రైతు వేదికలో శిక్షణ ఇచ్చారని ఆ విధంగానే వాడానని తెలిపాడు.