Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించిన డీవైఎస్ వో పరంధామిరెడ్డి
- ముఖ్య అతిథులుగా నగర పుర ప్రముఖుల హాజరు
- పొంగులేటి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
- మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా పోటీలు
- పురుషులు, మహిళల విభాగంలో డే అండ్ నైట్ కొనసాగనున్న కబడ్డీ
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
మాజీ ఎంపీ పొంగులేటి శీనన్న జన్మదిన సందర్భంగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టిన కబడ్డీ పోటీలు శుక్రవారం షురూవయ్యాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్స్ షిప్ ట్రోఫీ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలను జెండాను ఎగురవేసి డీవైఎస్ వో పరంధామి రెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఈ కబడ్డీ పోటీలకు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన పురుషులు, మహిళా క్రీడాకారులు తమ ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు సిద్ధమయ్యారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్, ప్రముఖ వైద్యులు డాక్టర్ వై. ప్రసాద్, ఎంపీపీ గోసుమధు, కార్పొరేటర్లు మలీదు జగన్, దొడ్డా నగేష్, చావా నారాయణ, మిక్కిలినేని నరేందర్, రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకష్ణ, గుమ్మా రోశయ్య, కొంగర జ్యోతిర్మయి, కీసరా పద్మజారెడ్డి, శ్రీకళా రెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. క్రిష్ణాఫర్ బాబు, నగర ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
-మార్చ్ ఫాస్ట్... కేక్ కటింగ్....
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారి అనుమతితో సాగుతున్న ఈ పోటీల ప్రారంభానికి ముందు ఆనవాయితీ గా మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి హాజరై పురుషుల, మహిళా క్రీడాకారులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. అనంతరం పొంగులేటి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను బాణాసంచాల వెలుగుల మధ్య పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథులుగా హాజరైన నగర పుర ప్రముఖులు కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
- రూ. లక్ష నగదు బహుమతి
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచే పురుషల, మహిళల జట్లకు మొదటి విజేతకు ట్రోఫీతో పాటు రూ. లక్ష ను అందజేయనున్నారు. తర్వాత ఏడు స్థానాల్లో నిలిచిన వారికి కూడా నగదు బహుమతులను అందచేస్తారు.
- పూల్స్ వారీగా మ్యాచ్ నిర్వహణ.... .
పురుషుల, మహిళల విభాగాల వారీగా జరిగే ఈ పోటీలను పూల్స్ వారీగా నిర్వహిస్తున్నారు. పురుషుల జట్లు 10, మహిళల జట్లు 10 ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో పూల్ ఏ లో మహబూబ్ నగర్, మెదక్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో పూల్ ఏ లో నల్గొండ, మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పూల్ బీ లో సూర్యపేట, రంగారెడ్డి, ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్ జట్లు ఉన్నాయి.
- ఛీర్ గర్ల్స్ సందడి...
పోటీలను వీక్షకులు ఆసక్తిగా తిలకించేందుకు ఛీర్గర్ల్స్ను ఆహ్వానించారు. పోటీలు జరుగుతున్న సమయంలో ఈ ఛీర్గర్ల్స్ తమ ప్రదర్శనలతో వీక్షకులను కనువిందు చేస్తున్నారు. మ్యాట్ ల పై జరిగే ఈ కబడ్డీ పోటీలు డే అండ్ నైట్ కొనసాగుతున్నాయి.