Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలి గాయమే ప్రాణాల మీదికి తేవొచ్చు
- డయాబెటిస్ ఉన్న వారికి పాదాల సంరక్షణ తప్పనిసరి
- ఖమ్మంలోని ప్రముఖ డయాబెటిస్ ఫుట్ సర్జన్ వెంకటేశం
- ఇకపై ''ఆర్క'' హాస్పిటల్లో పూర్తి స్థాయి సేవలు
నవతెలంగాణ- ఖమ్మం
డయాబెటిస్ ఇదో తియ్యని శత్రువు. మన శరీరంలోనే కనిపించకుండా దాగి ఉండి మనతోనే నిత్యం యుద్ధం చేసే మహమ్మారి. అందుకే మధుమేహం ఉన్న వారికి బయటి శత్రువుతో పనిలేదని అంటూ ఉంటారని ఎందుకంటే ఒంట్లో శత్రువుతో యుద్ధం చేయడంతోనే అతను అలసి పోతాడు కనుక.! ఈ వ్యాధిబారిన పడిన వారు తినే తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మనం నడవడానికి ఉపకరించే పాదాలను కూడా అత్యంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని ఖమ్మంలోని ప్రముఖ డయాబెటిస్ ఫుట్ సర్జన్, ఎంఎస్ సర్జన్ డాక్టర్ బీసం వెంకటేశం తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని ఆర్క ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో తన పూర్తి సమయాన్ని రోగుల కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు. డయాబెటిస్ వ్యాధి శరీరంలోని అవయవాల పని తీరుపై ప్రభావం చూపుతుందని, చాలా మందికి తెలుసు కానీ షుగర్ ఉన్న వారిలో పాదాల సమస్యలు కూడా తలెత్తుతాయని, మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు అన్నారు. వాస్తవానికి ఇది సర్వ సాధారణ విషయమే అన్నారు. డయాబెటిస్తో బొటనవేలు, పాదం లేక కాలును సైతం కోల్పోయిన సందర్భాలు లేకపోలేదని, కానీ ప్రతి రోజూ పాదాలను జాగ్రత్తగా సంరక్షించుకోవడం ద్వారా మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యలను అధిగమించవచ్చని, నిర్లక్ష్యం వహిస్తే కాలి గాయమే ప్రాణాల మీదికి తెస్తుందన్నారు. కాలానుగుణంగా మధుమేహం వల్ల నరాలు దెబ్బతినవచ్చు. దీన్ని ''డయాబెటిక్ న్యూరోపతి'' అని పిలుస్తారని, ఇది జలదరింపు, నొప్పిని కలిగిస్తుందని, అలాగే పాదాల్లో స్పర్శ అనుభూతిని కోల్పోయేలా చేస్తుందని, ఈ పరిస్థితి పుండ్లకు దారితీసే ప్రమాదాన్ని కల్పిస్తుందన్నారు. మధుమేహం సర్వ సాధారణ లక్షణం పాదాలలో రక్త ప్రవాహాన్ని తగ్గించడం... కాళ్లు, పాదాలకు తగినంత రక్తం ప్రవహించకపోవడం వల్ల పుండ్లు లేక ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందన్నారు. ఇవి నయం కావడం కష్టంగా మారుతుందని, కొన్నిసార్లు తీవ్రంగా ఇన్ఫెక్షన్ సోకి పుండు ఎప్పుడూ నయం కాని స్థితిని కలిగిస్తుందన్నారు. అలాంటప్పుడు చెడు ఇన్ఫెక్షన్ శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నారు. డయాబెటిస్ రోగులు ఇలాంటి తీవ్రమైన పరిస్థితి రాకుండా ఉండటానికి నిత్యం పాదాల సంరక్షణ అనివార్యం అన్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్య ప్రణాళికలో పాదాల సంరక్షణను చేర్చుకోవాలని, ఫుట్ డాక్టర్, పాడియాట్రిస్ట్ సలహాలు తీసుకోవడం అవసరమని, అలాగే ప్రతి రోజూ పాదాలను తనిఖీ చేసుకోవాలని , పాదాలను నిత్యం కడుక్కోవాలని, మొక్కజొన్న పిండి లేక కాలిస్లను సున్నితంగా స్మూత్ చేసుకోవాలని గోళ్ళను అడ్డంగా కత్తిరించుకోవాలని, అన్ని సమయాల్లో బూట్లు, సాక్స్ ధరించాలని, పాదాలను తీవ్రమైన వేడి అలాగే చలి నుంచి రక్షించుకోవాలని, పాదాలకు రక్త ప్రసరణ జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు. ప్రతిరోజూ పాదాలను తనిఖీ చేసుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించవచ్చు అన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ జి.రోజా కిరణ్, డాక్టర్ వీరపినేని రవి కుమార్, డాక్టర్ ఆర్. రవి కుమార్, డాక్టర్ కె. రవి కుమార్, డాక్టర్ రఘునందన్ పాల్గొన్నారు.